బయ్యారం, మార్చి 25 : మహబూబాబాద్ జిల్లా బయ్యారం ఏజెన్సీ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని కంబాలపల్లి, సుద్దరేవు, కొత్తగూడెం, కస్తూరినగర్, లింగగిరి, కొత్తపేట, గంధంపల్లి, నామాలపాడు, కోటగడ్డ, ఇర్సులాపురం తదితర ఏజెన్సీ గ్రామాల్లో యాసంగిలో మక్క పంట అధికంగా సాగు చేశారు. కొన్నిచోట్ల పంట చేతికంది కల్లాల్లో ఆరబెట్టగా, మరికొన్ని చోట్ల మరో పది రోజుల్లో పంట చేతికొస్తుండగా అకాల వర్షంతో కల్లాల్లోని మక్క తడిసిపోయింది. చేనులో ఉన్న పంట నేలకొరిగింది. దీంతో అష్టకష్టాలు పడి పంట సాగు చేస్తే చేతికొచ్చే సమయంలో నష్టం వాటిల్లడంతో గిరిజన రైతులు ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా కొత్తపేట, నామాలపాడు , గంధంపల్లి, సంత్రాల పోడ్ తండాలో ఇటుక బట్టీలోని ఇటుకలు తడిసిపోయాయి. ఈదురుగాలులకు మామిడి కాయలు నేలరాలాయి. బీరోని మడనిమడవ, పందిపంపుల గ్రామాల్లో నేలకొరిగిన మక్క పంటను మండల వ్యవసాయ శాఖ అధికారి రాంజీనాయక్, ఏఈవో శిరీష పరిశీలించారు.