10 ట్యాంకర్ల నీళ్లు పోసినా.. సరిపోతలేవు
రుద్రంగి, మార్చి 11 : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బండారి మహేశ్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. రెండు బోర్లు ఉండగా నీరు సరిపోకపోవడంతో గతేడాది రూ.5 లక్షలతో బావి తవ్వించాడు. ఈ ఎడాది బోర్లు ఎత్తిపోయాయి. బావిలో నీరు అందకపోవడంతో పొట్టదశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీళ్లు తీసుకువచ్చి పొలానికి పెడుతున్నాడు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.1000 వెచ్చించాల్సి వస్తుందని, పంటను కాపాడుకునేందుకు ఇప్పటి వరకు 10 ట్యాంకర్ల నీరు పోసినా సరిపోతలేవని మహేశ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
పంటలు ఎండుతున్నాయి.. సాగునీళ్లు ఇప్పించండమ్మా
మహబూబ్‌నగర్ కలెక్టరేట్/ధన్వాడ, మార్చి 11: ‘పంటలు ఎండుతున్నాయి.. సాగునీళ్లు ఇప్పించండమ్మా..’ అంటూ రైతులు కలెక్టర్‌ను వేడుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలోని పలు గ్రామాలను మంగళవారం కలెక్టర్ సందర్శించారు. పలువురు రైతులు పంటలను కాపాడాలని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ‘భూగర్భ జలాలు అడుగంటాయి.. వేసిన పంటలు చేతికొచ్చే సమయానికి ఎండుముఖం పడుతున్నాయి.. మా కుటుంబాలన్నీ వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయి’ అంటూ గోడు వెల్లబోసుకున్నారు. ఒకటిన్నర ఎకరాలో వేసిన వరి ఎండుముఖం పట్టిందని సంగనోనిపల్లి గ్రామ రైతు టీ నరేందర్‌రెడ్డి కలెక్టర్‌కు మొరపెట్టుకున్నాడు. రెండెకరాల్లో వరి వేస్తే నీళ్లులేక పంట ఎండుతున్నదని శేరి వెంకటాపూర్ రైతు శ్రీధర్‌రెడ్డి వాపోయాడు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం మందిపల్లి రైతు నర్సింహులు సాగు చేసిన వరిని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నాలుగెకరాల్లో పంట సాగు చేయ గా.. నీళ్లందక ఎకరం ఎండేదశకు చేరిందని రైతు వాపోయాడు. నిరుడు సమస్య రాలేదని, ఈ వేసవి ప్రారంభంలో నే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయని ఆవేదన వ్యక్తంచేశాడు. జిల్లాలో ఈ పరిస్థితి ఎకడెకడ ఉందో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ డీఏవోను ఆదేశించారు.
కోదండరావుపల్లిలో రైతుల నిరసన
నారాయణరావుపేట, మార్చి 11 : రంగనాయకసాగర్ ఎడమ కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలని కోదండరావుపల్లి, బంజేరుపల్లి రైతులు మంగళవారం సిద్దిపేట జిల్లా నారాయరావుపేట మండలం కోదండరావుపల్లిలో నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యాసంగి పంటలకు నీరందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పంట.. జీవాల పాలు
ఖలీల్‌వాడి, మార్చి 11: యాసంగి సాగులో రైతులకు నీటి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. సాగునీరు అందక పంటలు ఎండిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతుండగా.. కొందరు జీవాలకు మేతగా వదిలివేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం గుడితండాకు చెంది నగేశ్‌కు ఐదెకరాల పొలం ఉన్నది. పదేండ్లు ఇబ్బందుల్లేకుండా పంటలు సాగుచేశాడు. యాసంగిలో బోరు వట్టిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. సమీపంలోని కుంట నుంచి పైప్‌లైన్ ద్వారా పంటలు పండించుకోగా.. ప్రస్తుతం ఆ కుంట ఎండిపోయింది. దీంతో నగేశ్ ఎకరం పంటను మేకల కోసం వదిలేశాడు.
దీన స్థితి.. ఇదీ రైతు పరిస్థితి
రామారెడ్డి, మార్చి 11: ఈ చిత్రంలో దీనంగా కూర్చున్న రైతు పేరు లక్కాకుల నడిపి రాజయ్య. ఆయన స్వగ్రామం కామారెడ్డి జిల్లా రామారెడ్డి. ఆయన యాసంగిలో ఎకరన్నర భూమిలో వరి పంట వేశాడు. సాగునీరు అందక పొట్టదశలో ఉన్న పంట ఎండిపోయింది. బోరు కూడా ఎత్తిపోయింది. దీంతో పొలంలో పశువులు, గొర్రెలను మేపుతున్నాడు.
చినబోయిన రైతు చిన్నరాములు
మక్తల్, మార్చి 11: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మదనపల్లిలో రైతు హుస్సేనోళ్ల చిన్నరాములు గోస అంతా ఇంతా కాదు. ఉన్న బోరు వట్టిపోవడంతో కొత్తగా రెండు బోర్లు వేశాడు. అయినా చుక్కనీరు పడలేదు. దీంతో వరిపొలాన్ని, వేరుశనగ పంటను ఎలా కాపాడుకోవాలోనని చింతిస్తూ ఇలా దిగాలుగా కూర్చున్నాడు.
విద్యత్తు లోవోల్టేజీతో కాలుతున్న మోటర్లు
సంగారెడ్డి, మార్చి 11: సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి రూరల్ మండలంలోని అతాయిపల్లి గ్రామంలో రైతు గోస ఇది. విద్యుత్తు లోవోల్టేజీ సమస్యతో బోరు మోటర్ కాలిపోవడంతో మరమ్మతుల కోసం నానా యాతన పడుతున్నాడు. ఈ లోగా తన వరిపొలం ఎండుముఖం పట్టిందని ఆవేదన చెందుతున్నారు.
రెండ్రోజుల్లో 4 బోర్లు.. అయినా చుక్కనీరు రాలే..
తాండూరు రూరల్, మార్చి 13 : లక్షలు అప్పు చేసి నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాకపోవడంతో వరి పంట ఎండిపోతున్నదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం, చింతామణికి చెందిన గౌడి రాజశేఖర్‌కు 6.13 ఎకరాల భూమి ఉన్నది. ఇందులో 4 ఎకరాలు వరి సాగుచేశాడు. ప్రస్తుతం నీరు లేక వరి పంట ఎండిపోయే దశకు చేరుకున్నది. దీంతో 24 గంటల్లో (శని, ఆదివారం) తన పొలంలో నాలుగు బోర్లు వేయించాడు. ఒక్క బోరులోనూ చుక్క నీరు పడలేదు. గతంలో ఒక బోరు వేయిస్తే అందులో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. దాంతో వేసిన వరి పంట ఎండిపోతదనే ఆందోళన చెందుతున్నాడు. బోర్లు వేయించినందుకు రూ.1.96 లక్షలు కాగా, రూ.1.50 లక్షలు చెల్లించాడు. మిగితావి చెల్లించాల్సి ఉన్నది. అప్పు ఇచ్చిన వ్యక్తి 15 రోజుల్లో అప్పు చెల్లించాలనే కండీషన్ పెట్టాడు. ఆ రైతుకు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
విజయ డెయిరీని నిర్వీర్యం చేయొద్దు
కల్వకుర్తి, మార్చి 11 : పాలబిల్లులు చెల్లించకుండా పాడి రైతులను ఇబ్బందిపెడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి పాల ధరలు తగ్గించాలని కుట్రలు పన్నుతుండడంపై పాడి రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్యకంగానే విజయ డెయిరీని నిర్వీర్యం చేసే కుట్రలకు తెరలేపుతున్నదని తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో పాడి రైతులు నిరసన చేపట్టారు.
పెండింగ్ పాల బిల్లులు వెంటనే చెల్లించాలి
భువనగిరి కలెక్టరేట్, మార్చి 11: పాల రైతులకు మదర్ డెయిరీ, విజయ డెయిరీ బకాయిపడ్డ రూ.85 కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రైతు సంఘం ఆధ్వర్యంలో పాడి రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. పాడి పరిశ్రమను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు.
వ్యవసాయం కంటే వలసపోవడం నయం
మాకు, మా చిన్నమామకు మొత్తం 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అందరూ మమ్మల్ని భూస్వాములు అంటారు. కానీ, ఏనాడూ ఆయమన్న పంటలు పండలేదు. సాగునీరు లేక సుమారు 20 బోర్లు వేసినా ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. ఈ సారి ఆరు ఎకరాల్లో మక్కజొన్న, వరి, పొగాకు వేయగా సగం పంటలు ఎండిపోయాయి. పంటలు పండక అప్పుల్లో కూరుకపోతూ పిల్లలను చదివించలేకపోతున్నాం. తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేక ఇక వ్యవసాయం మీద ఆశ వదులుకున్నం. ఇక పట్నం వలసపోదామనుకుంటున్నం.
-జిట్టబోయిన నవలోక, రైతు, తీగారం, స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ జిల్లా