ఇందల్వాయి, మార్చి 13: పంటను కాపాడుకునేందుకు గిరిజన రైతు సాహసం చేశాడు. పక్షం రోజుల్లో ఏడు బోర్లు వేయించాడు. కానీ చుక్క నీరు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం జీకే తండాకు చెందిన రైతు లౌడ్య శ్రీను. ఈయన ఐదెకరాల్లో వరి వేశాడు. ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉండగా, బోర్లు ఎత్తిపోయాయి. పంటను కాపాడుకోవాలని 15 రోజుల వ్యవధిలో 7 బోర్లు వేయించాడు. ఒక్కదానిలో నుంచి కూడా నీళ్లు రాలేదు. చేసేదేమీ లేక పొలాన్ని పశువులకు వదిలేశాడు. పంట పెట్టుబడితోపాటు బోర్ల కోసం దాదాపు రూ.ఐదారు లక్షలు వెచ్చించాడు. తనలాగే మరికొందరు నష్టపోయారని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
యాసంగి సాగుకు నీటి కటకటే కాదు కరెంట్ కష్టాలు తీవ్రమయ్యాయి. ఓవర్‌లోడ్‌తో జగిత్యాల జిల్లా ఎండపల్లిలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ 83/బీ కెనాల్‌కు దగ్గర, తహసీల్దార్ కార్యాలయం వెనుక వైపు పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఓవర్‌లోడ్‌తో గురువారం కాలిపోయింది. అక్కడికి ట్రాక్టర్ వచ్చే అవకాశం లేకపోవడంతో పదిమంది ఇలా మోసుకొచ్చారు. అధికారులు స్పందించి ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
-వెల్గటూర్, మార్చి 13
గద్వాల, మార్చి 13: సాగునీటి సరఫరాను మెరుగు పరిచేందుకు చర్యలు చేపడుతామని, పంటలు ఎండిపోకుండా నీళ్లిచ్చి కాపాడుతామ ని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతో ష్ తెలిపారు. గురువారం ఆయన కేటీదొడ్డి మండలం కొండాపురం శివారులోని ర్యాలంపాడు ప్రధాన ఎడమ కాల్వ 104 ప్యాకేజీని, ఎండిపోతున్న పంటలను వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులతో మా ట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. వెంటనే కాల్వల్లోకి సాగునీటిని విడుదల చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
జనగామ రూరల్, మార్చి 13: జనగామ జిల్లాలోని బొమ్మకూర్ రిజర్వాయర్‌లోకి గో దావరి జలాలు వస్తున్నందున, వాటిని దిగువకు విడుదల చేసి ఎండిపోయిన పంటలకు జీవం పోయాలని రైతులు కోరుతున్నారు. జనగామ మండలంలోని గానుగుపహాడ్, ఎర్రకుంటతండా, మరిగడి, వెంకిర్యాల, వడ్లకొండ తదితర గ్రామాల రైతులు గురువారం గానుగుపహాడ్-వడ్లకొండ క్రాస్ రోడ్డు జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారిపై పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు.
జఫర్‌గఢ్, మార్చి13: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లిలో ఎండిన వరి, మ క్కజొన్న పంటలతోపాటు దేవాదుల కెనాల్ దుస్థితిని మాజీ ఎమ్మెల్యే రాజయ్య గురువారం పరిశీలించారు. పంటలు ఎండిన రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రైతులతో కలిసి కెనాల్ వద్ద బైఠాయించారు. సీఎం రేవంత్‌రెడ్డికి ముందుచూపు లేకపోవడంతో రైతులకు సాగునీటి క ష్టాలు ఎదురవుతున్నాయని విమర్శించారు.
నాగిరెడ్డిపేట, మార్చి 13: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మద సింగిల్ విండో లో గురువారం నిర్వహించిన మహాజనసభ రసాభాసగా మారింది. సొసైటీ పరిధిలో 108 మందికి సంబంధించి రూ.45 లక్షల రుణమాఫీ కాలేదు. దానిపై ఎందుకు స్పందించరని రైతు లు నిలదీశారు. ధాన్యం కొనుగోలులో సైతం తరుగుతో పాటు డ్రైవర్ పేరిట బస్తాకు రూపాయి చొప్పున వసూలు చేయడమేమిటని నిలదీశారు. ఎరువుల స్టాక్ విషయంలోప్రశ్నించారు.
జనగామ చౌరస్తా, మార్చి 13: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వరి, మక్కజొన్న పంటలు ఎండుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ఎండిపోయిన వరి కంకులతో ధర్నా చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్ మాట్లాడుతూ జిల్లాలోని 8 రిజర్వాయర్లు, 769 చెరువులు, కుంటలకు అవసరమైన సాగునీటిని నింపలేకపోయారని మండిపడ్డారు.
యాసంగిలో సాగు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నా. రెండు ఎకరాల్లో వరి వేసిన. వారం రోజుల నుంచి రెండు బోర్లలో నీళ్లు రావడం లేదు. మా బంధువు బోరు నుంచి పైప్‌లైన్ వేసుకొ ని పొలానికి నీళందిస్తున్న. వాళ్ల బోరు కూడా వారం, పదిరోజుల్లో ఎండిపోయే పరిస్థితి ఉన్నది. సాగుకు ఇప్పటివరకు రూ.25 వేలు ఖర్చు చేసిన. కొత్తగా బోర్లు వేయాలనుకున్నా దాదాపు 700 ఫీట్లకుపైగా డ్రిల్ చేస్తున్నా నీళ్లు వస్తలే.
– శంకర్‌నాయక్, పోచమ్మతండా, మం: కొడంగల్,