ఆదిలాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టనున్న ఇండస్ట్రియల్ కారిడార్‌కు తమ భూములు ఇవ్వమని, పరిశ్రమలకు వ్యవసాయ భూములను మినహాయించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గూడ, కొరాట, హత్తిఘాట్‌కు చెందిన రైతులు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రం అందించారు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ నాలుగు గ్రామాల్లోని 2,064 ఎకరాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, ప్రజాహితం పేరిట భూములను తప్పనిసరిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయిస్తే తాము సూచించిన డిమాండ్లు నెరవేర్చాలని వినతిపత్రంలో సూచించారు.
ఎకరాకు రూ.70 లక్షల పరిహారం ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రభుత్వం ఎంత భూమి తీసుకుంటుందో అంతే విస్తీర్ణంలో సాగుభూమి కేటాయించాలని, భూమి కోల్పోయిన రైతు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లతోపాటు వ్యవసాయ కూలీలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కొని తమ కన్నీళ్లపై అభివృద్ధిని నిర్మించవద్దని వేడుకున్నారు. చనాక, కొరాట ప్రాజెక్టు కాలువల ద్వారా రెండు పంటలు సాగుచేసే అవకాశం ఉందని, ఈ సమయంలో విలువైన తమ భూములను సేకరించడం సరికాదని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ధర నిర్ణయిస్తామని చెప్పారు.