ధర్మపురి/ఖానాపూర్ : యూరియా అందుబాటులో లేకపోవడంతో జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో రైతులు అవస్థలు పడుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని పీఏసీఎస్ గోదాములకు శనివారం యూరియా లోడ్లు చేరుకోవడంతో ఉదయం నుంచే రైతులు ఆధార్‌కార్డులు, పట్టాపాసు పుస్తకాలు పట్టుకుని క్యూలో నిలబడ్డారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పీఏసీఎస్‌కు యూరియా వచ్చిన్న విషయం తెలుసుకున్న తర్లపాడు, మస్కాపూర్, సుర్జాపూర్, దిలావర్పూర్, బాదనకుర్తి, ఎక్బాల్‌పూర్, గోసంపల్లి గ్రామాల రైతులు దాదాపు 150 మంది తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో నిలబడ్డారు. గంటల తరబడి నిలబడే ఓపిక లేకపోవడంతో చెప్పులు వరసలో పెట్టారు.
నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు పేరిట దౌర్జన్యంగా చేపడుతున్న భూసర్వేను తక్షణమే నిలిపివేయాలని నారాయణపేట జిల్లా ఊటూరు మండలం దంతన్‌పల్లి రైతులు శనివారం తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పరిహారం చెల్లించేందుకు హామీ ఇచ్చిన తర్వాతే సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపారు.
– ఊటూర్(నారాయణపేట)
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం రుక్కంపల్లిలో నీటి ఎద్దడి నెలకొన్నది. గ్రామానికి నీటిని అందించే ప్రధాన ట్యాంక్‌కు మిషన్ భగీరథ నీళ్లు అందడం లేదు. విద్యుత్తు కోతలు చూపు తూ అధికారులు నీటిని సరఫరా చేయడం లేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో శివారులోని వ్యవసాయ బోర్లను ఆశ్రయించి నీటిని తెచ్చుకుంటున్నారు.
– నవాబ్‌పేట