ఆసిఫాబాద్ టౌన్, ఆగస్టు 17 : వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ సమీపంలో జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. దాదాపు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కెనాల్ ద్వారా పంటలకు సాగు నీటిని అందించాలని, లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. రైతుల సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్లో అన్నదాతలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. సీఐ రవి ఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిషారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయినా ఆందోళన విరమించకపోవడంతో డీఎస్పీ అశోక్, ఆర్డీవో లోకేశ్వర్ వచ్చి రైతులు, ఎమ్మెల్యేతో చర్చించారు. సమస్య పరిషారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.