ఖమ్మం, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పాలనలో సమన్వయలోపం ఉందని, మంత్రులకు స్వేచ్ఛ కరువైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. శనివారం ఖమ్మం నగరంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంనారాయణ సమన్వయకర్తగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఏనుగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్దిప్రెస్ కార్యక్రమంలో కూనంనేని మాట్లాడారు.
సర్ పేరుతో ఓట్ల తొలగింపు ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడవడమేనని ఆరోపించారు. మిత్రపక్షంగా ఉన్న తమకు తెలుపకుండానే తమ అనుబంధ సంఘాన్ని ఆర్టీసీ ఎన్నికల్లో ఓడించేందుకు ఓ మంత్రి కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేపట్టినప్పుడు మిత్రపక్షంగా సమర్ధిస్తామని ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమాలకు సంబంధించి ప్రశ్నించక తప్పదని తెలిపారు.