మెదక్/హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ) : పాత రోజులు తీసుకొస్తానని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కోతల, సాగునీటి కష్టాలు తీసుకొచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. కళ్లెదుట గోదావరి నీళ్లున్నా మోటర్లు ఆన్ చేసి ఎత్తిపోసి సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కార్ రైతుల గోసపెడ్తున్నదని, ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కుల నీళ్లున్నా కన్నెపల్లి మోటర్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు.
దేవాదుల, కల్వకుర్తిలో 24గంటల నడుపాల్సిన మోటర్లను 8గంటలే నడుపుతున్నారని ధ్వజమెత్తారు. పరిపాలన అంటే మైకుల ముందు మాటలు చెప్పడం కాదని, కాళేశ్వరం మోటర్లు నడిపి రైతులు, పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని కాగజ్మద్దూర్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, నాయకులు హరీశ్‌రావు సమీక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సీఎం రేవంత్‌రెడ్డి గతంలో చెప్పినట్టుగానే రాష్ట్రంలో ఆనాటి కరెంట్ కోతలను మళ్లీ తీసుకొచ్చారని హరీశ్‌రావు విమర్శించారు. 24గంటల విద్యుత్తు సరఫరా మాట అటుంచితే.. కనీసం ఆరు గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. కరెంట్ కోతలను నిరసిస్తూ మెదక్ జిల్లా రామాయంపేట సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేసిన ఫొటోను శనివారం హరీశ్‌రావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. సమావేశంలో మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, నాయకులు దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌడ్ పాల్గొన్నారు.
కాగజ్మద్దూర్ సమీపంలో కరెంటు లేక ఎండిపోయిన వరి పొలాన్ని సునీతాలక్ష్మారెడితో కలిసి హరీశ్‌రావు పరిశీలించారు. పొలం వద్దకు వెళ్లి మహిళా రైతు నాగమణితో మాట్లాడి ఆమె కష్టాలు తెలుసుకొని చలించిపోయారు. కరెంట్ రాక కండ్లముందే పంటలు ఎండిపోతున్నాయని నాగమణి వాపోయింది. రూ.60 వేల పెట్టుబడి పెట్టి మూడెకరాల్లో వరి వేస్తే సగం ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. కరెంటు కోతలు, లో వోల్టేజీ వల్ల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయని మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని నాగమ్మ తెలిపింది.
ఆసియా క్రీడల్లో క్రికెట్లో స్వర్ణ పతకం సాధించిన భారత జట్టుకు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. టీమిండియా అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్ సాధించడం యావత్ దేశానికి గర్వకారణమని పేరొన్నారు. జట్టు సమష్టి ప్రదర్శనతో అద్భుత విజయాన్ని నమోదు చేసిందని, మ్యాచ్‌ను అత్యంత ఆకట్టుకొనే ముగింపుతో గెలుచుకున్నదని శనివారం ట్వీట్ చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి సమీపంలో బస్సు లోయలో పడిన ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి, సహాయం అందించాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.