కవాడిగూడ, అక్టోబర్ 3: ప్రజాస్వామ్య దేశంలో ఓటు కోసం అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ‘సర్’ ప్రక్రియతో కర్ణాటక, తెలంగాణలో భారీగా ఓట్లు తొలగించే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారని పాలకులను ప్రశ్నించారు. ‘సర్’ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన ప్రజాస్వామ్యాన్ని కూలదోసేవారిపై పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు.
ఓట్లు తొలగించాలని ఆర్డర్ ఇచ్చిన రంగా(మోదీ), బిల్లా (అమిత్‌షా)ను గద్దె దించాలని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతున్నదని, హక్కుల పరిరక్షణకోసం అందరూ ఏకమై పోరాడకపోతే చాలా కష్టమని హెచ్చరించారు. ‘సర్’ రద్దు చేయాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని, ఈవీఎంలను నిషేధించాలని, ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించాలని, పాత ఫామ్ 6తోనే కొత్త ఓటర్ల నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజాస్వామ్య సంఘాలు ఇందిరాపార్కు వద్ద శనివారం పెద్దఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. కార్యక్రమంలో సినీనటుడు ప్రకాశ్‌రాజ్, పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య,
మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, ప్రొఫెసర్ కాసీం, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతతో పాటు పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ బీజేపీ ‘సర్’ తీసుకువచ్చేముందు ప్రాంతీయ పార్టీలను విడగొట్టిందని అన్నారు. మహారాష్ట్ర, బెంగాల్‌లలో భారీగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. బంగ్లాదేశీయులు, చనిపోయినవారి ఓట్లు తొలగిస్తే తమకేం అభ్యంతరం లేదని చెప్పారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో యువతకు తమ సహాయం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. దీనిని రా జ్యాంగాన్ని కాపాడే పోరాటంగా భావించాలని ప్రొఫెసర్ కే నాగేశ్వర్ అన్నారు.