వికారాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. కాగా మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన శనివారం ఉదయం చోటుచేసుకున్నది. ఈ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం క్యాసారంలో వెల్డింగ్ పనులు పనిచేసే నారాయణరెడ్డి రెండు రోజుల క్రితం సొంత గ్రామమైన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంటలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అంత్యక్రియలకు అంతా కలిసి వెళ్లేందుకు సంగారెడ్డికి చెందిన ఓం సాయి ప్రైవేట్ బస్సును సర్పంచ్ మాట్లాడారు. శనివారం ఉదయం 51 మందితో కలిసి బస్సు చింతకుంటకు వెళ్తుండగా వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో నంది ఘాట్ దాటిన తరువాత చివరి మలుపు చూసుకోకుండా డ్రైవర్ వేగం పెంచడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్యాసారం గ్రామానికి చెందిన అత్తెల్లి అనంత్‌రెడ్డి ఇద్దరు భార్యలైన అత్తెల్లి పద్మమ్మ(66), యాదమ్మ(60)తోపాటు మాల పద్మ(50), ప్రమీల(52) దుర్మరణం చెందారు. కాగా మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉండగా, ఇంకో 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం కొందరిని వికారాబాద్‌లోని ప్రైవేట్ దవాఖానతోపాటు మరికొందరిని హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. కాగా బస్సు డ్రైవర్ పరారయ్యాడు. జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు దవాఖానకు చేరుకొని మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ దవాఖానలో క్షతగాత్రులను పరామర్శించారు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): బస్సు ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని శనివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఘటనపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సీపీఎం నేత జాన్‌వెస్లీ సంతాపం తెలిపి, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.