కేసీఆర్ హయాంలో తాపీగా రెండు పంటలు పండించుకున్న కర్షకులు.. ఇప్పుడు సాగునీరందక అల్లాడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామ శివారులోని నీలా-కొప్పర్గా, నీలా- కల్దుర్కి గ్రామాల రైతుల సౌలభ్యం కోసం కేసీఆర్ హయాంలో రూ.7 కోట్లతో రెండు చెక్‌డ్యాంలు నిర్మించారు. గతంలో వానకాలం పంటకే పరిమితమైన 2 వేల ఎకరాల్లో యాసంగికి కూడా ఢోకా లేకుండా పోయింది. చెక్‌డ్యాంల వద్ద నిలిచిన నీటితో భూగర్భ జలాలు పెరిగి సాగునీటి కష్టాలకు చెక్‌పడింది. గతంలో నిండు వేసవిలోనూ గలగల పారిన చెక్‌డ్యాంలు.. రేవంత్ సర్కారు వచ్చాక వెలవెలబోయాయి. పొట్టదశలో ఉన్న వరి నిలువునా ఎండిపోతున్నది.
– రెంజల్
ఐదేండ్ల నుంచి ఎన్నడు కూడ పూడిక తియ్యలె. నీళ్లు ఎల్లక సేను ఎండిపోతాంది. సేను కూడ ఇంత రోగమొచ్చింది. దీంట్ల నీళ్లు ఎల్లక గోసయితంది. నాలుగు ఎకరాలకు నీళ్లు వరుస తల్లు పెడుతున్న. కొంత ఎండుతంది ఏం జేయ్యాలే అర్థమైతలేదు. ఒకప్పటి లాగ రాత్రి పూట వచ్చి కరెంట్పెడుతున్నం. అయినా బాయిల ఊట వత్తలేదు. ఇన్ని గింజలన్న పండుతయని బాయిల పూడిక తీయిస్తున్న. ఈ సారి సేనుపోయి లాస్ అయ్యేటట్టే ఉన్నదని భయమైతున్నది.
-అయిలేని రాజిరెడ్డి, రైతు, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)
హన్వాడ, మార్చి 18 : ఓ వైపు తగ్గుతున్న భూగర్భ జలాలు.. మరోవైపు చెరువులు, బావులు అడుగంటుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రానికి చెందిన మహిళా రైతు ఆశంగారి చెన్నమ్మ ఎకరంన్నర పొలంలో యాసంగిలో వరి సాగు చేసింది. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో నీళ్లు అందక ఎండుముఖం పట్టింది. మంగళవారం రూ.లక్ష అప్పు చేసి 300 ఫీట్ల లోతులో రెండు బోర్లు డ్రిల్లింగ్ చేయించినా చుక్కనీరు రాకపోవడంతో చెన్నమ్మ దిక్కుతోచని స్థితిలో పడింది. పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదని, అప్పులకు వడ్డీ పెరిగిపోతున్నదని కంటతడి పెట్టుకున్నది.
బోర్లు వట్టిపోవడంతో వరి ఎండిపోతున్నది. నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు నీరందక రైతాంగం అల్లాడుతున్నది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం జైనాపూర్ శివారులో 400 ఎకరాల్లో సాగుచేసిన వరి ఎండిపోతున్నది. చివరి తడి పెడితే పంట చేతికొచ్చే పరిస్థితి ఉండగా, నీళ్లు లేక పొలాలు నెర్రెలు బారుతున్నాయి.
– కోటగిరి
దేవరకద్ర, మార్చి 18 : కోయిల్‌సాగర్ నీటిని సాగు కోసం ఇవ్వలేమని మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేందిరబోయి స్పష్టం చేశారు. కేవలం తాగు నీటి కోసం ప్రాజెక్టులో నీటిని నిల్వచేసినట్టు చెప్పారు. మంగళవారం ఆమె మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు శివారులో ఎండిన పంటలను పరిశీలించారు. కోయిల్‌సాగర్ నుంచి రెండ్రోజులు సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.
కొండపాక(కుకునూరుపల్లి), మార్చి 18 : సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన రైతు మ్యాడల కిష్టయ్య యాసంగిలో రెండెకరాల్లో వరి పంట వేశాడు. తలాపునే తపాస్‌పల్లి రిజర్వాయర్ ఉన్నా డీ4 కెనాల్ ద్వారా నీళ్లు విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక రైతు కిష్టయ్య పంట ఎండిపోతున్నది. ఇప్పటికే సగం వరకు పంట ఎండిపోగా మిగిలిన పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో వరి పంటకు నీటిని అందిస్తున్నాడు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎండాకాలంలోనూ డీ4 కెనాల్లో నీటిని విడుదల చేసి మత్తడి దుంకించారని రైతు కిష్టయ్య చెప్పాడు.
కొమురవెల్లి, మార్చి 18 : సాగుకు నీళ్లిస్తరా లేదా? అని బీఆర్ఎస్ నాయకులు అధికారులను ప్రశ్నించారు. నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయంటూ వారు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో మండుటెండలో రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి తపాస్‌పల్లి రిజర్వాయర్ పరిశీలనకు వచ్చినప్పుడు రెండు రోజుల్లో నీళ్లు వస్తాయని చెప్పి వెళ్లాడని, ఆయన చెప్పి పదిరోజులైనా ఇప్పటికీ నీళ్లు రాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.