మాగనూరు : నారాయణపేట జిల్లాలో రైతుకు సాగునీటి కష్టాలు తప్పడంలేదు. పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. సంగంబండ రిజర్వాయర్ రైట్ హైలెవెల్ కెనాల్ పరిధిలో సాగునీరు అందక సుమారు వందల ఎకరాలు ఎండుముఖం పడుతున్నాయి.
వంతుల వారి విధానంలో కాల్వకు పూర్తిస్థాయిలో సాగునీరు రాకపోవడంతో ఆయకట్టు పరిధిలోని మాగనూరు మండలం తాళంకేరికి చెందిన కొందరు రైతులు చిన్నవాగు కాల్వలో ట్రాక్టర్ల ద్వారా మోటర్లు ఏర్పాటు చేసి నీటిని తోడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది రైతులు కిలోమీటర్ల పొడవునా పైపులు వేసుకొని నీటికోసం ఎదురుచూస్తున్నారు. కాల్వలకు సాగునీరు వచ్చేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
మళ్లీ.. ఎనుకటి కాంగ్రెస్ కాలమొచ్చింది. పదేండ్లు కరువు లేకుండ బతికినం. నిరుడు ముందటేడు కాల్వలు వదిలితె కుంటలు నిండి బోర్లల్ల ఊట పెరిగేది. ఒక్క తడి కాడ మక్కజొన్న మొదలారిపోయింది. ఐదెకరాలు వరి పెడితె ఎకరం ఎండింది. మిగితాది వరుస తళ్లు పెడుతున్న ఎప్పుడు పోయేది తెలువదు. రెండు బోర్లుంటె ఒకటిపోయింది. ఇంకోటి ఆగిపోస్తుంది. పంటనీళ్లు లేక ఎండితె పానం ఉసూరుమనిపిస్తుంది. అప్పుల పాలై ఆగమవుడే. మక్కజొన్న ఏపుగా వచ్చింది. బిర్రుగా పండుతదని ఆశ ఉండె. నీళ్ల కరువొస్తదని అనుకోలే. తిండి మందం వరి పంట చేతికొస్తే అదే పదివేలని దేవున్ని మొక్కుతున్నం.
– సుడిగెల సోంమల్లయ్య, రైతు, కడవెండి, మం: దేవరుప్పుల, జిల్లా జనగామ