Runa Maafi | హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 29: రుణమాఫీ పై ప్రభుత్వం మాట తప్పిందంటూ హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయినా రుణమాఫీ చేయలేదని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఒంటికాలిపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2 లక్షలకుపైగా రుణం ఉంటే మిగతా డబ్బులు బ్యాంకులో చెల్లించాలని మంత్రులు చెప్పడంతో అప్పులు తెచ్చి మరీ డబ్బులు చెల్లించామని, నెలలు గడుస్తున్నా మాఫీ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
2 లక్షల కంటే 200 నుంచి 300 వందలకు పైబడి అప్పు ఉందన్న నెపంతో తమకు రుణమాఫీ చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం స్పష్టతనివ్వకుంటే ఈ ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని హెచ్చరించారు. ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ రెండు పంట కాలాలు పూర్తయినా ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా రైతులే స్వచ్ఛందంగా నిరసనకు దిగడం చర్చనీయంగా మారింది.