దహెగాం, మే 14 : ధాన్యం తూకంలో మోసం చేస్తున్నారంటూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం ఒడ్డుగూడ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఒడ్డుగూడ గ్రామానికి చెందిన రైతు సత్తన్న సోమవారం రాత్రి 500 బస్తాల ధాన్యం కాంటా వేయగా.. అంచనా వేసిన దిగుబడికి.. కేంద్రంలో వచ్చిన తూకానికి తేడా ఉండటంతో మంగళవారం ఉదయం కొనుగోలు కేంద్రానికి వెళ్లి తాను విక్రయించిన ధాన్యం బస్తాల్లోనుంచి ఒక బస్తాను తీసుకొళ్లి ప్రైవేట్ కాంటాపై తూకం వేయించారు. అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రంలో 40 కిలోల 500 గ్రాములుగా ఉన్న ధాన్యం బస్తా.. అదే ప్రైవేట్ కాంటాపై 43 కిలోలు చూపించింది. ఇలా నాలుగైదు బస్తాలను తూకం వేసి చూశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో క్వింటాల్‌కు ఐదారు కిలోల ధాన్యం తక్కువగా చూపిస్తున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని తోటి రైతులకు చెప్పడంతో వారంతా కలిసి కొనుగోలు కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు తుమ్మిడి నారాయణ వల్లే తాము మోసపోయామంటూ రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇతను పనిచేసిన గిరివెళ్లి కొనుగోలు కేంద్రంలోనూ ఇలాంటి మోసాలకే పాల్పడినట్టు రైతులు ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ కేంద్రంలో 220 క్వింటాళ్ల ధాన్యం కొని మిల్లర్లకు పంపించారని, అందులో కూడా మోసం జరిగి ఉంటుందని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిర్వాహకుడు తుమ్మిడ నారాయణపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.