కొల్చారం, జూన్ 6 : వడ్లు తెచ్చి 40 రోజులు కావస్తున్నా ఇంకా కాంటా చేయడం లేదని మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ రైతులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. మృగశిర కార్తె సమీపిస్తున్నా.. ఇంకా కొనుగోలు కేంద్రంలోనే వడ్లు అమ్ముకోవడానికి పడిగాపులు పడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మంద నాగులు మాటాడుతూ.. గ్రామంలో సుమారు లక్ష బ్యాగుల ధాన్యం ఉత్పత్తి అయ్యిందని తెలిపారు.
లారీలు రాకపోవడంతో ఇంకా సుమారు 25 లారీల ధాన్యం కల్లాల్లోనే ఉన్నదని పేర్కొన్నారు. ఎస్సై మొయినొద్దీన్ రాస్తారోకో వద్దకు చేరుకుని నచ్చచెప్పారు. తహసీల్దార్‌తో ఫోన్లో రైతులతో మాట్లాడించగా..లారీలు పంపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.
కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూర్ తహసీల్దార్ కార్యాయంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు. అడిషనల్ కలెక్టర్ గిరి హామీతో రైతులు శాంతించారు.