Amangal | ఆమనగల్లు, మే 26 : కొనుగోళ్లలో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో రైతులు రోడ్డెక్కితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. వారిని ఈడ్చుకెళ్లి అరెస్ట్‌చేశారు. సోమవారం రైతులు హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించగా బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు నేనావత్ పత్యానాయక్తోపాటు పార్టీ శ్రేణులు వారికి మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వారిని నెట్టేయడంతోపాటు బలవంతంగా అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్.. ఠాణాకు చేరుకుని అరెస్టు అయిన బీఆర్ఎస్ నాయకులు, రైతులను పరామర్శించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి బలవంతంగా నెట్టేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల తో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకుని తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. వడ్లను విక్రయించేందుకు తీసుకొచ్చి 25 రోజులు దాటినా తూకం వేయరా? అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని ధ్వజమెత్తారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి రైతు నుంచి ధాన్యాన్ని సేకరించి.. మద్దతు ధర చెల్లించిన విషయాన్ని గుర్తుచేశారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని అన్నారు. సర్కార్ రైతులకు పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేయకుండా, రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని అర్హులకు అందించకుండా ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యాన్ని కొర్రీలు పెడుతూ కొనకపోవడంతో వర్షాలకు తడిసి రైతులు కష్టం నేల పాలవుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ధాన్యం కొంటలేరని వంటా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల కేంద్రంలోని తాడిచెర్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనడం లేదంటూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. తాడిచెర్ల-మల్లారం ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేసి వంటావార్పు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసేవరకు ఆందోళన విరమించేది లేదంటూ భీష్మించారు.
రెక్కల కష్టమంతా నీటిపాలాయె..
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలకేంద్రానికి చెందిన మహిళా రైతు వెంకవ్వ మొలకెత్తిన ధాన్యంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. నెలన్నర కిందట కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకురాగా ఐకేపీ నిర్వాహకులు జాప్యం చేయడంతో వర్షానికి తడిసింది. దీంతో సోమవారం మొలకెత్తిన ధాన్యంతో నిరసన తెలిపింది.
నిప్పుబెట్టి.. నిరసన తెలిపి..
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని బూరుగుమళ్లలోని కొనుగోలు కేంద్రం వద్ద కల్లెడ-బూరుగుమళ్ల గ్రామాల ప్రధాన రోడ్డుపై ధాన్యాన్ని తగులబెట్టి నిరసన తెలిపారు. పీఏసీఎస్ సిబ్బంది కొనుగోలు కేంద్రాన్ని నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నట్టు మండిపడ్డారు. సుమారు 8 లారీల ధాన్యం ఉన్నా కొనుగోళ్లు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. వర్షాలతో ధాన్యం తడిసి పోతుందని తెలిపారు.
రోడ్డుపై బర్లతో నిరసన
తమ వ్యవసాయ బావికి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ రైతు దంపతులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా గునుకుల కొండాపూర్‌లో నెల క్రితం ధాన్యం లోడ్‌తో వెళ్తు న్న లారీ విద్యుత్తు వైర్లకు తాకడంతో కరెంటు స్తంభం విరిగిపోయింది. అప్పటి నుంచి పోచయ్య, సుశీల దంపతుల వ్యవసా య బావికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో సోమవారం కొండాపూర్‌లోని రోడ్డుపై బర్లను కట్టేసి నిరసన తెలిపారు.- గన్నేరువరం