హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ‘రైతులు బాగుపడాలి. నిరంతర కరెంటు రావాలి. పనికిమాలిన ట్రిబ్యునళ్లు పోవాలి. ఏడాదిలో నీళ్ల పంపకాలు జరగాలి. మన దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి. అంటే దమ్మున్న ప్రభుత్వం రావాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవన్నీ చేయటానికే బీఆర్ఎస్ వచ్చిందని కుండబద్ధలు కొట్టారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ‘దేశ ఇరిగేషన్ పాలసీని సమూలంగా తీసి బంగాళాఖాతంలో పడేసి కొత్త ఇరిగేషన్ పాలసీని ప్రవేశపెట్టాల్సిందే. ఈ పనిని కాంగ్రెస్, బీజేపీ చేయలేకపోయాయి. కచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తది. చేసి చూపిస్తం. ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. ఐదారేండ్లలో ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తాం’ అని తెలిపారు. ‘పనికిమాలిన ట్రిబ్యునళ్లను పక్కకు పడేసి.. కేంద్రం ఒక ఏడాదిలో వాటర్ డిస్ట్రిబ్యూషన్ చేయరాదా? చకచకా పర్మిషన్లు ఇయ్యరాదా? రెండేండ్లలో వర్క్స్ స్టార్ట్ చేయరాదా? ప్రత్యేకమైన చట్టం చేయరాదా?’ అని నిలదీశారు. దమ్మున్న గవర్నమెంట్ ఉంటే ఇవి సాధ్యం అవుతాయని, అవి చేయడానికే బీఆర్ఎస్ వచ్చిందని మరోసారి తేల్చి చెప్పారు.
మన దేశ భూభాగం 32 లక్షల చదరపు కిలోమీటర్లు అని, ఎకరాల్లో 83 కోట్ల ఎకరాలు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. విస్తీర్ణంలో అమెరికా మన కన్నా రెట్టింపు ఉన్నా, అక్కడ వ్యవసాయ భూమి 29 శాతం మాత్రమే అని, చైనా మన కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉన్నా, 16 శాతమే వ్యవసాయ భూమి ఉన్నదని వివరించారు. కానీ ప్రపంచంలోనే 50 శాతం వ్యవసాయ భూమి ఉన్న ఏకైక దేశం భారత్ అని, మన దగ్గర 41 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని చెప్పారు. దీనికితోడు తీర ప్రాంతాల్లో తేమ వాతావరణం, హిమాలయ ప్రాంతాల్లో శీతల వాతావరణం, తెలంగాణ వంటి భూ పరివేష్టిత రాష్ర్టాల్లో ఊష్ణ వాతావరణం ఉన్నదని గుర్తు చేశారు. అందుకే దేశంలో ఆపిల్ పండుతుందని, మామిడి కూడా పండుతుందని వెల్లడించారు. దేశంలో 140 కోట్ల జనాభా రూపంలో అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయని తెలిపారు. ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చెయిన్ మన దగ్గర ఉండాలని, కానీ పిల్లలు విదేశీ కంపెనీల నుంచి పిజ్జాలు, బర్గర్లు కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రైతు ప్రభుత్వం వస్తే తప్ప.. ఈ కాంగ్రెస్, బీజేపీ సర్కార్లు చేయవు. అందుకే బీఆర్ఎస్ నినాదం అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని పెట్టాం. కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతులు బాగుంటరు, పంటలు పండుతాయి, ధరలు వస్తాయి. లక్షల ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు పెట్టగలిగితే ప్రపంచానికి అన్నం పెడతాం’ అని సీఎం పేర్కొన్నారు.