హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ప్రభావంతో వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే రైతులకు రూ.8వేల ప్రోత్సాహక నిధులు కేటాయించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ పద్మ డిమాండ్ చేశారు. గురువారం ఆమె మాట్లాడుతూ వానలు లేక రైతులు వేసిన పత్తి విత్తనాలు 30శాతం మొలకెత్తలేదని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలో 1,057 సర్వే నంబర్లో 113 ఎకరాలు భూదాన్, 120 ఎకరాల పట్టా భూములను మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని కొని వ్యవసాయేతర భూములుగా మార్చి రూ.1,030 కోట్ల లోన్ తీసుకున్నట్టు ఆరోపించారు. బ్యాంకులు పరిమితులను దాటి లోన్ ఇవ్వటంపై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. జూలై 18, 19, 20 తేదీల్లో యాదగిరిగుట్టలో రైతులకు రాష్ట్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్టు పద్మ తెలిపారు.