మక్తల్, జూలై 18 : రైతులకు సరిపడా ఎరువులు అందించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో హైవే-167పై బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చిన్న హనుమంతు అధ్యక్షతన రాస్తారోకో చేపట్టగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులు, విత్తనాలు అందించడంలో ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. మక్తల్ పీఏసీసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలు, చెప్పులు క్యూలో ఉంచారని గుర్తుచేశారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పేరుతో ప్రజలను మోసం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఒకటిన్నర టీఎంసీ సామర్థ్యం ఉన్న భూత్పూర్ జలాశయం నుంచి కొడంగల్‌కు 7 టీఎంసీల నీటిని ఏ విధంగా తరలిస్తారో సీఎం వివరించాలని నిలదీశారు. ఆందోళనలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు పాల్గొని రైతులకు సంఘీభావం తెలిపారు.