కడ్తాల్, డిసెంబర్ 24: గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని మర్రిపల్లి రైతులు బుధవారం కలెక్టరేట్లో ఎంపీ మల్లు రవితో కలిసి అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, భూ సేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజుతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.25 లక్షలు, ఒక ప్లాట్తోపాటు వ్యవసాయంపై ఆధారిపడిన వారికి అదనంగా రూ.5.60 లక్షలు అందిస్తామని పేర్కొన్నారు. మల్లు రవి మాట్లాడుతూ భూ నిర్వాసితులకు ఒక ప్లాట్తోపాటు ఇందిరమ్మ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పరిహారం పెంపు విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చెప్పారు. రైతులు మాట్లాడుతూ ఎకరానికి రూ.కోటి పరిహారంతోపాటు 200 గజాల ప్లాట్, ఇంటికో ఉద్యోగం అందించాలని డిమాండ్ చేశారు.