హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ)/బోడుప్పల్: ఔషధ మొకల పెంపకంతో అధిక లాభాలు ఆర్జించవచ్చని, ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బోడుప్పల్‌లోని ఔషధ, సుగంధ మొకల పెంపకంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్, అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ)లో శనివారం జరిగిన కిసాన్ మేళాలో మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఔషధాల అవసరం పెరుగుతున్నదని, అంతర్జాతీయ సంస్థ లు, వేదికలు ఈ మొక్కల పెంపకానికి ప్రాధా న్యం ఇస్తున్నాయని తెలిపారు. పంటలపై లాభం, అమ్మకంపై భరోసా ఉంటే అలాంటి పంటల సాగుకు రైతులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. ఔషధ మొకల పెంపకంలో ప్రపంచ మారెట్ను చైనా శాసిస్తున్నదని, ఆ తర్వాత క్యూబా, తైవాన్లు ఉన్నాయని వివరించారు. ఆయా దేశాల్లో పండించిన పంటను అక్కడి ప్రభుత్వాలు కొనుగోలు చేసే వ్యవస్థ ఉన్నందునే వాటికి సాధ్యమైందని తెలిపారు. కానీ మనదేశంలో అత్యధికంగా తెలంగాణ నుంచి వరి ధాన్యం ఉత్పత్తి అవుతున్నా కేంద్రం మాత్రం కొనుగోలుకు నిరాకరిస్తున్నదని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
దేశానికే అన్నం పెట్టే స్థాయిలో నేడు తెలంగాణ ముందువరుసలో ఉందని తెలిపారు. నిమ్మగడ్డితో మేలురకం ఉత్పత్తులు సాధించిన వనపర్తి జిల్లా చికారుచెట్లు తండాకు చెందిన గిరిజన మహిళ మోతీబాయిని, కాశగడ్డి (పామారోజా)తో వివిధ ఉత్పత్తులను తయారుచేసిన యాదాద్రి భువనగిరి జిల్లా ఏదుల్లగూడేనికి చెందిన సుదర్శన్‌రెడ్డిని మంత్రులు అభినందించారు. కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ ప్రబోద్ కుమార్ త్రివేధి, డాక్టర్ సంజయ్‌కుమార్, శాస్త్రవేత్త కిరణ్‌బాబు, బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి పాల్గొన్నారు.