వేంసూరు, మే 25: విత్తనాల కోసం అన్నదాతలు పడుతున్న అగచాట్లకు ఈ ఫొటో ప్రత్యక్ష నిదర్శనం. జీలుగ విత్తనాల కోసం ఖమ్మం జిల్లా వేంనూరు మండలం పల్లెవాడ, లచ్చన్నగూడెం, కందకూరు, వేంనూరు సొసైటీల పరిధిలోని రైతులు 2 రోజులుగా సొసైటీ కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. విత్తనాలు దొరకుతాయో, లేదోనన్న భయంతో గంటలకొద్దీ క్యూలో నిల్చొని అవస్థలు పడుతున్నారు. శనివారం ఒకరినొకరు తోసుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం పల్లెవాడ, లచ్చన్నగూడెం, కందుకూరు, వేంసూరు సొసైటీల పరిధిలోని రైతులకు ఆయా సొసైటీ కార్యాలయాల వద్ద రెండు రోజులుగా జీలుగు విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. విత్తనాల కోసం సొసైటీ కార్యాలయాల వద్దకు చేరుకున్న రైతులు గంటలకొద్దీ నిలబడి ఒకరినొకరు తోసుకుంటూ అవస్థలు పడుతున్నారు. సొసైటీకి సరిపడా విత్తనాలు రాకపోవడంతో ఆందోళనతో రైతులు ఎగబడుతున్నారు. కందుకూరు, లచ్చన్నగూడెం సొసైటీల పరిధిలో శనివారం విత్తనాల పంపిణీ అనంతరం ఏవో రామ్మోహన్ను వివరణ కోరగా.. మండలానికి 2 వేల క్వింటాళ్ల విత్తనాలు రావాల్సి ఉండగా.. 1,500 క్వింటాళ్లు వచ్చినట్టు తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో మిగతా 500 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.