కందుకూరు, జనవరి 21 : రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచ సమీపంలో ఏర్పాటుచేస్తున్న ఫోర్త్‌సిటీ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్పారు. దీంతో రైతులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడవకు దిగారు. 10 శాతం రైతుల భూములు పోతే 90 శాతం మందికి న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు వితండవాదానికి దిగారు. దీంతో బాధిత రైతులు.. తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. ఈ ఘటన మంగళవారం కందుకూరు మండల పరిధిలోని లేమూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ రాజు బాధిత రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు.
ఈ క్రమంలో బాధిత రైతులు, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కొంతమంది రైతులను ఉద్దేశించి.. మీకేం పని ఇక్కడ అంటూ నాయకులు గొడవ సృష్టించారు. దీంతో మా భూములు పోతుంటే మేం ఊరుకుంటామా? మా భూములు మా ఇష్టం.. మీకేంటని రైతులు ప్రశ్నించారు. పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్ నాయకులను అక్కడి నుంచి పంపించారు. డిప్యూటీ కలెక్టర్ సమావేశాన్ని వాయిదావేసి వెళ్లిపోయారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెగేసి చెప్పారు. మా భూములను ఎట్టిపరిస్థితిలో ఇచ్చేది లేదని స్పష్టంచేశారు. రైతులతో కాంగ్రెస్ నాయకుల వాగ్వాదంపై పలువురు విచారం వ్యక్తంచేశారు.