అక్కన్నపేట, మే 15: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారంలో భూభారతి చట్టంపై గురువారం రెవెన్యూ అధికారులు నిర్వహించిన అవగాహన సదస్సును రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నందారం, కపూర్‌నాయక్‌తండాలో మొత్తం 1,456 ఎకరాలు ఉండగా, 932 ఎకరాలు సీలింగ్ భూమిగా రికార్డుల్లో నమోదైందని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీలింగ్ భూసమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
నేటికీ సమస్య పరిష్కారానికి నోచలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి పొన్నం ఓఎస్డీ శ్రీనివాస్‌రెడ్డి చేరుకొని తహసీల్దార్ సురేఖ, రైతులతో మాట్లాడారు. నందారం సీలింగ్ భూముల విషయం మంత్రి పొన్నం దృష్టిలో ఉందని, ఇందుకోసమే అక్కనపేటను పైలట్ మండలంగా ఎంపిక చేసినట్టు చెప్పారు. రైతులు తమకు భూమి హక్కు కల్పించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.