రంగారెడ్డి, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో ఫార్మా వ్యతిరేక పోరు మళ్లీ ఊపందుకున్నది. కందుకూరు, యాచారం మండలాల్లో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని వెంటనే రద్దుచేయాలని, తమ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, ఇప్పటికే మేడిపల్లి, తాటిపర్తి, కుర్మిద్ద, నానక్‌నగర్ గ్రామాల్లో వ్యతిరేక పోరాటం ప్రారంభమైంది. ఫార్మా వ్యతిరేక కమిటీ కన్వీనర్‌గా నియమితులైన కవుల సరస్వతి ఆయా గ్రామాల్లో రైతులను ఏకతాటి మీదకు తీసుకువచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆదివారం మేడిపల్లిలో ఫార్మా వ్యతిరేక ర్యాలీ నిర్వహించగా, సోమవారం తాటిపర్తి గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఫార్మా ఏర్పాటు వలన జరిగే అనర్థాలపై అవగాహన సదస్సును నిర్వహించారు.
ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాధిత గ్రామాలైన మేడిపల్లి, తాటిపర్తి, నానక్‌నగర్, కుర్మిద్ద గ్రామాల్లో జరుగుతున్న అవగాహన సదస్సులకు పోలీసుల అనుమతులు తప్పనిసరి అని చెబుతున్నారు. తాటిపర్తిలో జరిగిన అవగాహన సదస్సు వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. పోలీసులు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని, ఫార్మాసిటీ రద్దు అయ్యేవరకు పోరాటాలు నిర్వహిస్తామని సరస్వతి తెలిపారు.