కామారెడ్డి : ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించక పోవడంతో ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత పనితీరును నిరసిస్తూ ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. తాజాగా కామారెడ్డి(Kamareddy) జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అజమాబాద్ గ్రామంలో అదనపు కలెక్టర్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.
సన్న వడ్ల కొనుగోలులో(Grain procurement) సొసైటీ నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. గ్రామాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ విక్టర్ ఎదుట రైతులు తమ సమస్యలను ప్రస్తావించారు. సొసైటీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రైస్ మిల్లర్లు ధాన్యం కటింగ్ తీస్తుండడంతో తమకు ఆర్థిక నష్టం కలుగుతోందని, సొసైటీ అధికారులు సన్న వడ్ల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. తక్షణమే సొసైటీ విధానంలో మార్పులు చేసి ధాన్యం కొనుగోళ్లను చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.