రాయికల్ : కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లు పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతన్నకు కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం సహకరించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. బహిరంగ మార్కెట్లో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు బారులుదీరాల్సిన దుస్థితి ఏర్పడింది. యూరియా కోసం ఉదయం నుంచే సహకార సంఘాల గోదాములు, రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాతలు బారులు తీరుతున్నారు.
తాజాగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఆలూర్ గ్రామంలోని సింగిల్ విండో గోదాం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ జిరాక్స్లు క్యూ లైన్లో పెట్టారు. అయినా కూడా యూరియా దొరుకుతుందనే నమ్మకం లేదని రైతులు వాపోతున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.