ములుగు జిల్లా కేంద్రంలోని పాత ఎఫ్‌సీఐ గోదాంల వద్ద మంగళవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో అందించే యూరియా కోసం రైతులు ఎండలో క్యూ కట్టారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అన్ని దుకాణాలను మూసివేయడంతో జిరాక్స్‌ల కోసం రైతులు నానా తంటాలు పడ్డారు. పోలీసులు వన్‌వే పెట్టి ఎక్కడిక్కడ ద్విచక్రవాహనాలను నిలుపడంతో కొందరు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి వద్ద ఏర్పాటు చేయనున్న రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని ఆదిలాబాద్ రూరల్, జైనథ్ మండలాలకు చెందిన 8 గ్రామాల రైతులు తేల్చి చెప్పారు. భూములు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు వేధించడాన్ని నిరసిస్తూ మంగళవారం వారు ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్‌లు మంగళవారం భైంసా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు రైతుల నుంచి అడుగడుగునా నిరసన వ్యక్తమవుతున్నది. మంగళవారం దుద్యాల తహసీల్దార్ కార్యాలయంలో పోలేపల్లికి చెందిన మహిళా రైతు తూర్పు రాజమ్మ పురుగుల మందు డబ్బాను బయటకు తీసి చావనైనా చస్తాను గానీ భూమి మాత్రం ఇచ్చేది లేదని చెప్పారు. అప్రమత్తమైన తోటి రైతులు ఆమె చేతిలోని
పురుగుల మందు డబ్బాను గుంజుకున్నారు.