చిల్పూరు, మే 19 : ‘కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులవుతున్నది. వారం రోజుల నుంచి రోజుకు కొంత మేరకే కాంటా పెడుతున్నరు. సేకరించిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు పంపడంలేదు. ఇంకెన్ని రోజులు ఇక్కడ నిరీక్షించాలి’ అని రైతులు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను వివరించి సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.
‘సరిపడా గన్నీ సంచులు ఇవ్వడం లేదు.. రోజూ కాంటా పెట్టడం లేదు’ అని మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నా టార్పాలిన్లు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. స్పందించిన ఎమ్మెల్యే శ్రీహరి కలెక్టర్ సందీప్ కుమార్ ఝూకు ఫోన్ చేసి రాజవరంలోని కొనుగోలు కేంద్రం పరిస్థితిని వివరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.