హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతులు క్యూలైన్లలో తిప్పలు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నదాతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లైన్లలో నిలబడే సహనం లేకనే రైతులు యూరియా కొరత ఉందని చెప్తున్నారని మండిపడ్డారు. యూరియా కోసం లైన్లో నిల్చున్న వారిని ఎవరో ఒకరు తీసుకెళ్లి ధర్నా చేయిస్తున్నారని తెలిపారు. కామారెడ్డి పర్యటనలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘ఒక్కసారి మంది అందరూ ఒక్క దగ్గర నిలబడితే.. యూరియా అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనబడుతుంది.
సినిమా హిట్ అయినా అందరికీ టికెట్ దొరుకుతుంది కానీ లైన్ పెద్దగా కనబడుతుంది. ఆఖరాయనకు, మొదటాయనకు సేమ్ టైమ్లో ఇవ్వలేం కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా వెయ్యి మంది లైన్లో ఉంటే కూడా మొదటోడికి, చివరోడికి ఎనిమిది గంటలు పడుతది. వీడు ఎనిమిది గంటలు లైన్లో నిలబడే సరికి.. అసలు యూరియానే అందుబాటులో లేదని.. వాడు కూర్చోవడానికి పోయి.. రోడ్డుకు అడ్డంగా కూర్చుంటడు కొన్నిసార్లు. ఈడ కూర్చుంటే ఏంది, ఆడ కూర్చుంటే ఏంది అని.. ఎవడో ఒకడు తీసుకెళ్లి ఆడ కూర్చోబెడుతడు’ అని వ్యాఖ్యానించారు. రైతులను వాడు, వీడు అని సంబోధించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.