వలిగొండ/తిమ్మాపూర్, ఫిబ్రవరి 13 : యూరియా కొరతను నివారించి రైతులకు సరిపడా అందించాలని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. గురువారం యా దాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ, కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్‌లో అధికారులను నిలదీశారు. అరూరు పీఏసీఎస్ పరిధిలోని వేములకొండలో రైతుల వెసులు బాటుకోసం యూరియాను అందిస్తున్నారు. నాట్లు వేసుకొని కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్నా సరిపడా యూరియా అందక రైతులు ఇబ్బందిపడుతున్నారు.
గురువారం పీఏసీఎస్‌కు యూరి యా రావడంతో ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున అందించడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి అధికారులను నిలదీశారు. సరిపడా యూరియాను అందించాలని ఆందోళనకు దిగారు. కాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీలో గురువారం యూరియా కోసం రైతులు అధికారులు, సిబ్బందితో గొడవకు దిగారు. సొసైటీకి 470 బస్తాలు మాత్రమే రావడంతో కొంతమంది రైతులకు దొరకలేదు. పలుకుబడి ఉన్నవారికి ఎకువ బస్తాలు ఇచ్చారని, తమకు ఒకటి కూడా ఇవ్వలేదని పలువురు రైతులు మండిపడ్డారు.