నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 14: నెల రోజులు దాటినా ధాన్యం కొనేటోళ్లు లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘గన్నీ బ్యాగులియ్యరు.. కాంటా పెట్టరు.. లారీలు రావు.. గిట్లయితే మేమెప్పుడు అమ్ముకోవాలి?’ అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రు. ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యా న్ని నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. మక్కజొన్న గోదాముల వద్ద హమాలీలు, అధికారులు కుమ్మక్కై డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఖమ్మం జిల్లా రూరల్ మండలం పెద్దతండా ఏదులాపురం పరిధి హౌసింగ్ బోర్డు గోదాము వద్ద కార్యాలయ గేట్లకు తాళాలు వేసి సూర్యాపేట-ఖమ్మం ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనకు దిగారు. తూకంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రాజీవ్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పం దిల్లలోని ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా రైతులు మండుటెండలో పంట కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. నిర్మల్ జిల్లా పెంబిలోని బస్స్టాండ్ సమీపంలో మక్క రైతులు రోడ్డెక్కారు రైతులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. గన్నీ బ్యాగ్స్ ఇవ్వాలని, లారీల కొరత తీర్చాలని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాచాపూర్లో ధర్నాకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో పొద్దుతిరుగుడు రైతు లు వంటావార్పు నిర్వహించారు. కరీంనగర్ మండలం ఇరుకుల్ల, మొగ్దుంపూర్ గ్రామాల్లోని కేంద్రాల్లో అధిక తూకం వేస్తున్నారని ఆందోళనకు దిగారు. అధికారులు చెప్పినా నిర్వాహకుల తీరు మారడం లేదని మండిపడ్డారు.
కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలించాలని కరీంనగర్ జిల్లా చొప్పదండిలో రాస్తారోకో నిర్వహించారు. మిల్లు నిర్వాహకులు ధాన్యం దింపుకొనే వరకు కదిలేది లేదని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్హ్రదారిపై ఎలిగేడు మండలం రావులపల్లి రైతులు బైఠాయించారు. ‘దండం పెట్టి చెబుతున్నం సార్లు.. దయచేసి మా వడ్లను కొనండి’ అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటకు చెందిన రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. తహసీల్దార్ రాంచందర్ హామీతో అందోళన విరమించారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఖిల్లాఘణపురం-మహబూబ్నగర్ రోడ్డుపైకి చేరుకొని బైఠాయించారు.
తాలు పేరుతో వడ్లు కాంటా చేయడం లేదని ఆగ్రహించిన రైతులు వనపర్తి జిల్లా బుద్ధారంలో ఆందోళకు దిగారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం దోమలెడ్గిలో మక్క రైతులు ఆందోళన చేపట్టారు. హనుమకొండ జిల్లా శాయంపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలోని మక్కల కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, అధికారుల తీరును నిరసిస్తూ మక్క రైతులు ధర్నా చేపట్టారు. మక్కల అన్లోడింగ్లో జాప్యా న్ని నిరసిస్తూ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ సమీపంలోని ఆంజనేయ మిల్లు ఎదుట రైతులు ధాన్యానికి నిప్పు పెట్టి ఆందోళన చేపట్టారు.

ధాన్యం కొనాలని నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం రాచాపూర్లో గురువారం ధర్నా చేస్తున్న రైతులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న అన్నదాతలు

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో రోడ్డుపై రైతుల ఆందోళన

కోతలు లేకుండా ధాన్యం కొనాలని కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని తెలంగాణ చౌరస్తాలో రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో రోడ్డుపై వంటావార్పు చేస్తున్న రైతులు

తూకంలో మోసాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లిలో రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు

కాంటా పెడ్తలేరని నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం దోమలెడ్గిలో మక్కలతో నిరసన తెలుపుతున్న రైతులు

ధాన్యం కొనకపోవడాన్ని నిరసిస్తూ వనపర్తి మార్కెట్ వద్ద ఖిల్లాఘణపురం-మహబూబ్నగర్ రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్లో కరీంనగర్-వరంగల్ హైవేపై రాస్తారోకో చేస్తున్న అన్నదాతలు

హనుమకొండ జిల్లా శాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని కొనుగోలు కేంద్రంలో నిరసన తెలుపుతున్న మక్క రైతులు

భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ఆంజనేయ మిల్లువద్ద మక్కలకు నిప్పు పెట్టి నిరసన తెలుపుతున్న రైతులు

నిర్మల్ జిల్లా పెంబి బస్స్టాండ్ సమీపంలో రోడ్డుపై బైఠాయించిన మక్క రైతులు

సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో రైతులతో మాట్లాడుతున్న మార్క్ఫెడ్ డీఎం హబీబ్