కాంగ్రెస్ సర్కారుపై కర్షకులు కన్నెర్రజేశారు. రైతు భరోసా కోతలపై భగ్గుమన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు ఇస్తామంటూ నమ్మబలికి ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఇస్తామంటూ మాటతప్పడంపై రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. మాట తప్పిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. రైతు డిక్లరేషన్ పేరిట వరంగల్ వేదికగా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద బహిరంగ సభ ఏర్పాటుచేసి రైతుభరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం భరోసాలో కోతపెట్టి ఏడాదికి రూ.12వేలే ఇస్తామని ప్రకటించడంపై అదే వరంగల్ జిల్లా భగ్గుమన్నది. రైతుభరోసాలో కోతను నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగగా, అత్యధికంగా వరంగల్‌లోనే అన్నదాతలు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందని రైతు నేతలు విమర్శించారు.
Rythu Bharosa | కాంగ్రెస్ సర్కారుపై కర్షకులు కన్నెర్రజేశారు. రైతుభరోసా కోతలపై భగ్గుమన్నారు. రైతుభరోసా పేరిట అన్నదాతలకు పంటల పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలు ఇస్తామంటూ నమ్మబలికి ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్ పెద్దలు.. ఇప్పుడు ఆ సాయాన్ని రూ.12 వేలు మాత్రమే ఇస్తామంటూ మాటతప్పడంపై రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాతలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా, నయవంచన అని మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతు భరోసా పథకం కింద రూ. 15 వేలు అందించాలని డిమాండ్ చేశారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్ దండేపల్లి,(లక్షెట్టిపేట), జనవరి 6/చెన్నూర్/జైపూర్/జన్నారం : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. లక్షెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. చెన్నూర్, జైపూర్‌లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజా రమేశ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి సీఎం ఫ్లెక్సీని దహనం చేశారు.
కదం తొక్కిన కరీంనగర్..
కరీంనగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పి రైతుభరోసా రూ.12 వేలు మాత్రమే ఇస్తానని ప్రకటించడంపై కరీంనగర్ భగ్గుమన్నది. తెలంగాణ చౌక్‌లో నగర మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి, సుల్తానాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రాల్లో ధర్నా చేశారు. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.
పాలమూరులో పెల్లుబికిన నిరసనలు
మహబూబ్‌నగర్, జనవరి 6: వనపర్తి జిల్లా పెద్దగూడెం చౌరస్తాలో డిక్లరేషన్ పత్రాలను మంటల్లో దహనం చేశారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ జోగుళాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ ఆందోళనలు జోరుగా సాగాయి.
ధర్నాలతో దద్దరిల్లిన నిజామాబాద్..
ఎల్లారెడ్డి రూరల్, జనవరి 6: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, కమ్మర్పల్లి, వేల్పూర్, నవీపేట్, ముప్కాల్, బాల్కొండ తదితర మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పాల్గొన్నారు.
హనుమకొండలో డిక్లరేషన్ ప్రతులను సమాధి చేసి నిరసన
హనుమకొండ, జనవరి 6 : వరంగల్ పశ్చి మ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిరసన తెలిపారు. వరంగల్ డిక్లరేషన్ చేసిన స్థలంలో హామీ పత్రాలను పాతిపెట్టారు.
ఉమ్మడి ఖమ్మంలో భగ్గుమన్న అన్నదాతలు
ఖమ్మం, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా తల్లాడలో రైతులతో కలిసి సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధర్నా చేశారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లిలో దున్నపోతుకు వినతిపత్రం అందజేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
సూర్యాపేటలో సీఎం దిష్టిబొమ్మల దహనం
సూర్యాపేట, జనవరి 6 : సూర్యాపేట జిల్లాకేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గరిడేపల్లి, పెన్‌పహాడ్, అనంతగిరి, మఠంపల్లి మండల కేంద్రాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేసి, సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. భువనగిరి లోని ప్రిన్స్ కార్నర్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాయి.
22
ఉమ్మడి వరంగల్‌లో ఉద్రిక్తత..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు చోట్ల సీఎం దిష్టిబొమ్మలను ద హనం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ నగరంలోని ఖిలావరంగల్ పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద నిర్వహించిన రాస్తారోకోలో మాజీ ఎమ్మె ల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ, గోరికొత్తపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. రేగొండలోని జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తున్న గండ్రను పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్, హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో నిర్వహించిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో నిర్వహించిన రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
దాస్యం అరెస్ట్.. ఉద్రిక్తత
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా కార్యాలయం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానానికి వెళ్తున్న దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కనీసం నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు అనుమతించాలని కోరినా వినకుండా పోలీసులు నిర్బంధించారు. పోలీసులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మధ్య తోపులాటతోపాటు వాగ్వాదం చోటు చేసుకున్నది. వినయ్ భాస్కర్‌తోపాటు నాయకులు, కార్యకర్తలను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నగరంలో మంత్రుల పర్యటన ఉన్నందున ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్టేషన్లోనే నిర్బంధించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోనే వినయ్‌భాస్కర్ నిరసన తెలిపారు.