కోనరావుపేట, మే 18 : మూలవాగులో ఇసుక తోడుతుంటే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, వెంటనే తవ్వకాలు ఆపాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి రైతులు నిరసన చేపట్టారు. శనివారం గ్రామంలోని మూలవాగులో ఇసుక రీచ్‌ను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల అవసరాల నిమిత్తం ఇసుకను రీచ్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇసుక అవసరమున్న వారు సర్కారుకు నగదు చెల్లించి వారానికి రెండుసార్లు ఇసుకను తరలించుకునేందుకు అనుమతి ఉన్నదని తెలిపారు.
ఇదే అదనుగా భావించిన ట్రాక్టర్ యజమానులు సర్కారు అనుమతిచ్చిన చోట కాకుండా ఇష్టమొచ్చిన ప్రాంతంలో ఇసుక తవ్వేస్తుండటంతో సమీపంలోని వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, బోర్లు వట్టిపోతున్నాయని వాపోయారు. ఏటా వర్షాకాలంలో వ్యవసాయ భూముల్లోకి వరద వస్తున్నదని, భూములు కోతకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకొని అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకోగా, రైతులు వారిని నిలదీశారు. ఇప్పటికైనా ఇసుక తవ్వకాలు ఆపాలని లేకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.