నమస్తే తెలంగాణ నెట్వర్క్,నవంబర్ 13 : ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్ జిల్లా గోపన్పల్లి శివారులోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను పెట్టి నిరసన తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల, ఝాన్సీలింగాపూర్ గ్రామాల్లో రైతులు ధర్నా చేపట్టారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూర్ రైతులు బీర్కూర్-పోతంగల్ ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్లోని కొనుగోలు కేంద్రంలో సన్నరకం వడ్లను కొనకపోవడం, మిల్లర్లు తరుగు తీస్తుండడంపై నిరసన వ్యక్తంచేశారు.
కలెక్టర్ విక్టర్, అధికారులు వచ్చి సన్నధాన్యం కొనుగోలుతోపాటు కాంటాలు వేయడం ప్రారంభించడంతో రైతులు శాంతించారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలోని మిల్లుల వద్ద కొనుగోళ్లు నిలిపివేయడంతో అన్నదాతలు రోడ్డెక్కారు. లక్ష్మీగణపతి మిల్లుల్లో ధాన్యం లోడ్లను తీసుకోకపోవడంతో రైతులు అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి మిల్లు యాజమాన్యంతో మాట్లాడడంతో రైతులు శాంతించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో చెనగాని సైదులు ధాన్యం లోడు ట్రాక్టర్ను రోడ్డుకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపాడు. ట్రాఫిక్ జామవడంతో సంబంధిత అధికారులు ఐకేపీ సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించడంతో నెమ్మదించాడు.
నీలగిరి, నవంబర్13 : ధాన్యం కొనుగోళ్లలో తప్పు ప్రభుత్వానిది కాదని.. మిల్లర్లది అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో రైస్ మిల్లర్లు కొంతమంది అక్రమాలకు పాల్పడి బ్లాక్ దందాలకు బరితెగించడంతోనే ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఏర్పడిందని, వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేస్తామని తెలిపారు. మిల్లర్లు బ్లాక్ మార్కెట్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, రైతులను ఇబ్బందులను గురిచేస్తే ఎస్-1 కేసులు పెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ పత్తికి గిట్టుబాటు ధర ఇప్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. మార్కెట్లో ధాన్యం కాంటాలు కాకపోవడంతో ఒక్కసారిగా వచ్చిన వర్షంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైతులు ఇబ్బంది పడ్డారు.