నస్రుల్లాబాద్, అక్టోబర్ 25: కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు అన్లోడింగ్ చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలోని బాన్సువాడ-బోధన్ ప్రధా న రహదారిపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేయగా, మరో రైతు పోలీసుల కాళ్లపై పడ్డాడు. నస్రుల్లాబాద్ సొసైటీ పరిధిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సుగుణ ఇండస్ట్రీస్, గిరిధారి ఇండస్ట్రీస్‌కు కేటాయించారు. అయితే, బొమ్మన్‌దేవ్‌పల్లి రైతుల ధాన్యాన్ని తీసుకునేందుకు సుగుణ ఇండస్ట్రీస్ నిర్వాహకులు ససేమీరా అన్నారు. ఇదేమని రైతులు వెళ్లి అడిగితే.. ‘ఔటన్ (బియ్యం) 56 నుంచి 63 కిలోలే వస్తుంది.
మాకు మీ ఊరి వడ్లు వద్దు’ అని రైస్‌మిల్ నిర్వాహకులు చెప్పడంతో ఆందోళనకు దిగారు. గతంలో ఔటన్ ఎక్కువ వచ్చినప్పుడు తమకు ఎక్కువ డబ్బు ఇవ్వలేదు కదా? అని రైతులు నిలదీశారు. ఈ క్రమంలో రైతులు సదరు మిల్లును సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ నస్రుల్లాబాద్ ఎక్స్ రోడ్‌పై బైఠాయించారు. రెండున్నర గంటలపాటు రాస్తారోకో చేయడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడికి వచ్చిన సీఈవో శ్రీనివాస్, డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఏవో మోహన్‌రెడ్డి, తహసీల్దార్ సువర్ణతో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యాన్ని కాంటా పెట్టి రైస్‌మిల్లులకు తరలించి, ఓటీపీ వచ్చే వరకు సొసైటీ వారు ఎంత తరుగు తీస్తున్నారో తెలియడం లేదని అన్నారు.
తూకం వేసిన వెంటనే రైతులకు రసీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లారీలో ధాన్యం పంపాక రైతులే తరుగును భరించాలని సొసైటీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. క్వింటాకు 4కిలోల తరుగు తీస్తున్నారని వాపోయారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరగా రైతులు ఒప్పుకోలేదు. తమకు న్యాయం చేయాలని ఓ రైతు నస్సుల్లాబాద్ ఎస్సై రాఘవేం ద్ర కాళ్ల మీద పడ్డారు. మరో రైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా తో టి రైతులు అడ్డుకున్నారు. ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని బీర్కూర్ ఎస్సై మహేందర్ అనడంతో రైతులు మండిపడ్డారు. రైస్మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.