తాలపల్లి, మే 28: నెలన్నర దాటినా ధాన్యం కాంటా పెట్టడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల వద్ద సూర్యాపే ట-దంతాలపల్లి రోడ్డుపై మొలకెత్తిన వడ్ల బస్తాలతో రైతులు బుధవారం బైఠాయించారు. ధాన్యాన్ని కాంటా పెట్టకుండా నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యం, మొలకెత్తిన బస్తాలను అధికారులు తక్షణమే మిల్లులకు తరలించి తరుగు లేకుండా దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయడం లేదని మండిపడ్డారు.
మా గోడు ఎవరూ పట్టించకుంటలేరు..
రాస్తారోకో చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తమను అడ్డుకోవద్దంటూ కాంగ్రెస్ కార్యకర్త అయిన రైతు యాకూబ్ కానిస్టేబుల్ కాళ్లు పట్టుకున్నాడు. తమ గోడును ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని వాపోయాడు. మళ్లీ వ్యవసాయ పనులు మొదలైనప్పటికీ తమ ధాన్యం కాంటా కాలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. కాంటాలు పెట్టిన బస్తాలను ఎందుకు మిల్లులకు తరలించడంలేదని ప్రశ్నించారు. ఆందోళన వద్దకు పీఏసీఎస్ సీవో వెంకన్న వచ్చి రైతులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.