Vedma Bhojju | మంచిర్యాల, మే 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘అసలు మీరు రైతులే కాదు.. నిజమైన రైతులు ధర్నా చేయరు’ అంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రైతులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగిన రైతులు ఆయన్ను కొనుగోలు కేంద్రంలోకి తీసుకెళ్లి సమస్యలను ప్రత్యక్షంగా చూపించారు. దీంతో రైతుల నుంచి నిరసన సెగ గట్టిగానే తగిలినట్టయింది. వివరాలు ఇలా.. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్‌లో నిర్మల్-మంచిర్యాల జాతీయ రహదారిపై రైతులు గురువారం రాస్తారోకోకు దిగారు. అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటూ లింగాపూర్, మూసాయిపేట చుట్టు పక్కల గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించారు. గంటన్నర అనంతరం అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును.. ధాన్యాన్ని ఇంకెప్పుడు కొంటారని రైతులు నిలదీశారు.
ఈ క్రమంలో రైతులతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వాగ్వాదానికి దిగారు. ‘మీరు అసలు నిజమైన రైతులే కాదు. నిజమైన రైతులెవరూ ధర్నాలు చేయరు. నేను చెప్పింది వింటారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో రైతులు ఒక్కసారిగా ఎమ్మెల్యేపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక్కడ ఉన్నవారంతా రైతులమేనని, ఎవరో చెప్తే వచ్చి రాస్తారోకో చేయడం లేదంటూ ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. తమతో వస్తే కొనుగోలు కేంద్రాల్లో పడుతున్న ఇబ్బందులను, వర్షానికి తడిసిన ధాన్యాన్ని చూపిస్తామన్నారు. అక్కడి నుంచి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును వెంట పెట్టుకుని లింగాపూర్‌లోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లారు.
వర్షానికి తడిసిన, నీట మునిగిన ధాన్యాన్ని ప్రత్యక్షంగా చూపించారు. గత నెల 20న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన అధికారులు.. ఇప్పటి వరకు పదిశాతం ధాన్యం కూడా కొనలేదని చెప్పారు. గన్నీ సంచులు లేవని, హమాలీల కొరత ఉందని, దానికి తోడు లారీలు సమయానికి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే హామీతో వివాదం సద్దుమణిగినా.. రైతులతో ఎమ్మెల్యే మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రాస్తారోకో చేసే అన్నదాతలను పట్టుకొని రైతులే కాదనడం.. అక్కడి నుంచి రైతులు ఎమ్మెల్యేను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి వాస్తవాలను చూపించడం, రైతుల నుంచి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు నిరసన సెగ తగలడం చర్చనీయాంశంగా మారింది.
ఖానాపూర్ రూరల్, మే 21 : తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రైతులు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాంరెడ్డిపల్లె శివారులో మంచిర్యాల ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. సత్తనపల్లి, గొసంపల్లె, గొడలపంపు, దిలావర్పూర్, కొత్తపేట్, బావపూర్, బీర్నంది, సోమార్పేట్ గ్రామాలకు చెందిన దాదాపు 200 మందికిపైగా రైతులు ఆందోళన నిర్వహించారు. అదే రహదారి గుండా మండల పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ధర్నా వద్దకు చేరుకోగా.. తడిసిన ధాన్యం ఎందుకు కొనడం లేదని రైతులు నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే దాటవేసే ధోరణి ప్రదర్శించడం, సరైన హామీ ఇవ్వకపోవడతో ఆగ్రహం వ్యక్తంచేశారు.