వరి, మక్క కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. పంట చేతికొచ్చి రోజులు గడుస్తున్నా సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కొనుగోలు ప్రారంభమైన చోట వసతులు కల్పించడం లేదని, కొన్న ధాన్యాన్ని తరలించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
రోజుల తరబడి కేంద్రాల్లోనే తిష్ట వేయాల్సివస్తున్నదని చెబుతున్నారు. మరోవైపు కొనుగోలులో తరుగు పేరిట ఇబ్బందులు పెడుతున్నారని, నిర్వాహకుల తీరు బాగాలేదంటూ రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పంట చేతికొచ్చిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరి ధాన్యాన్ని మార్కెట్‌కు తెచ్చి 20 రోజులైనా కాంటా ప్రారంభించకపోవడాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ
మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై గురువారం రైతులు రాస్తారోకో చేపట్టారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నిలిచింది.

కేంద్రాలకు వడ్లు తెచ్చి నెలరోజులైనా కొనకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. గురువారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లిలో కరీంనగర్-జగిత్యాల రహదారిపై రాస్తారోకో చేపట్టారు. నెల రోజుల క్రితం ధాన్యం తెస్తే ఒక్క లారీ వడ్లు మాత్రమే సేకరించారని తెలిపారు. కొనుగోలుపై నిర్లక్ష్యమెందుకని ప్రశ్నించారు.

మక్కలు కొనాలని జగిత్యాలలో గురువారం కూడా రైతులు రోడ్డెక్కారు. బీట్‌బజార్ వద్ద బైఠాయించి అధికారులను నిలదీశారు. వర్షం కారణంగా మక్కలు తడిసి ముద్దకావడంతో రైతులు కంటతడి పెట్టారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతామని పోలీసుల హామీతో ఆందోళన విరమించారు.

నెలరోజులైనా మక్క కొనుగోలులో నిర్లక్ష్యంపై వరంగల్ జిల్లా నల్లబెల్లి రైతులు నిలదీశారు. మండల కేంద్రంలో మక్క జొన్న బస్తాలను తగులబెట్టి నిరసన తెలిపారు. మార్క్‌ఫెడ్‌తోపాటు పీఏసీఎస్ సిబ్బంది వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్, పోలీసుల హామీతో రైతులు ఆందోళన విరమించారు.

కేంద్రాలకు వచ్చిన మక్కలను నాలుగు రోజులుగా కొనుగోలు చేయడం లేదని రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో గురువారం రాస్తారోకో చేపట్టారు. మక్కలు అమ్మేందుకు కారేపల్లి కేంద్రానికి వెళ్లాలని చెబుతున్నారని మండిపడ్డారు. తమపై కేసులు పెట్టుకోండి.. మక్కలు మాత్రం కొనండి అని రైతులు డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లా బోనకల్లు రైతువేదికలో అధికారులు గురువారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సభ’ రసాభాసగా మారింది. మకజొన్న కొనుగోలుపై తెలంగాణ రైతు సంఘం నాయకులు, రైతులు కలిసి అధికారులను చుట్టుముట్టారు. కల్లాల్లో కునారిల్లుతున్న కర్షకుల కష్టాలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు.

దొడ్డు వడ్లు కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో రైతులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. పంట కోసి రోజులు గడుస్తున్నా వడ్లను కాంటా వేయడం లేదని, కాంటా వేసిన బస్తాలను తీసుకెళ్లే వారు లేరని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అకాల వర్షం రైతన్నను వెంటాడుతున్నది. ఆరుగాలం కష్టాన్ని నీళ్లపాలు చేస్తూ అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్కెట్‌యార్డుల్లో నిల్వ ఉంచిన జొన్న, మక్కలు తడిసి ముద్దయ్యాయి. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు.