నిజామాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరెంట్ కోతలపై కన్నెర్ర చేస్తున్నారు. సాగుకు సరిపడా విద్యుత్తు సరఫరా కాకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. పొట్ట దశకు వచ్చిన పంటలను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలను వాడుకోలేక పంటలను ఎండబెట్టుకోలేక కన్నీరు మున్నీరవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో గడిచిన కొద్దిరోజులుగా ధర్నాలు, రాస్తారోకోలతో అన్నదాతలు నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వ సలహాదారు, విద్యుత్తు శాఖ మాజీ మంత్రి షబ్బీర్ అలీ సొంత మండలం మాచారెడ్డి మండలంలోనే గురువారం ధర్నాలు జరిగాయి.
అవిభక్త మండలంలో ఒకే రోజు రెండుచోట్ల రైతన్నలు రోడ్డుపైకి వచ్చారు. సాగుకు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవా రం కామారెడ్డి నియోజకవర్గంలోని పాల్వంచ మండలం ఆరెపల్లి స్టేజీ వద్ద రైతులు ధర్నా చేశారు. రేవంత్రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం, అసమర్థతపై మండిపడ్డారు. 24 గంటలు గడువకముందే ఇదే మండలంలో మరోసారి రైతులు ఆందోళనకు దిగాల్సి వచ్చింది. గురువారం ఒకేరోజు మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ వద్ద రైతులు భారీగా చేరుకుని ధర్నా నిర్వహించారు. పాల్వంచ మండలంలోని పా ల్వంచ మర్రి స్టేజీ వద్ద మంథని దేవునిపల్లి, వాడి, ఫరీద్పేట, పాల్వంచ గ్రామాల రైతులు నాణ్యమైన కరెంటివ్వాలని డిమాండ్ చేశారు.
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కరెంట్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారు. కర్షకులకు కంటి మీద కునుకు లేకుండాపోయింది. ఇలాంటి దుస్థితిలో రైతుల బాగోగులు పట్టించుకోవాల్సిన కాంగ్రెస్ పాలకులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇందుకు సీఎం వ్యవహారశైలి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 80వ దశకం వింటేజ్ ప్రామ్ట్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన ఫొటోలను క్రియేట్ చేసుకుని సంబురపడటం కనిపించింది.
‘80వ దశకంలో నేను కూడా జాయిన్ అయ్యాను’ అంటూ ఆంగ్లంలో రాసుకుని ముఖ్యమంత్రి తన ఫొటోలను పోస్టుచేశారు. రేవంత్రెడ్డి పోస్టుకు అనేక మం ది విభిన్న రకాలుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ అంతా సీఎంను నెత్తిన ఎక్కించుకుంటూ పొగడ్తల్లో ముంచారు. సామాన్య జనం, రైతులు, యువత మాత్రం తమదైన శైలిలో స్పందించారు. సీఎం ఫొటోకు ఆరు గ్యారెంటీల కార్డులను రిప్లయ్ రూపంలో పోస్టుచేశారు. యువతకు ఉద్యోగాలు ఏవి? అంటూ కొందరు ప్రశ్నించారు. ఇంకొందరు ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఫొటోలను అటాచ్ చేయడం కనిపించింది.