హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కొందరు రాజకీయ స్వార్థపరులు యూరియా కోసం చెప్పుల లైన్లను పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. యూరియా కేటాయింపు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ విషయాన్ని మరిచిపోయిన ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో యూరియా నిల్వలు, సరఫరాపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో తుమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నౌకాయానానికి ఆటంకాలు ఎదురుకావడం, ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తిలో అంతరాయంతోనే యూరియా కొరత ఏర్పడ్డదని చెప్పారు.
కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవ చూపి ఆర్ఎఫ్సీఎల్ నుంచి తెలంగాణకు రావాల్సిన 63 వేల టన్నుల యూరియాను ఇప్పించాలని కోరారు. తక్కువ డిమాండ్ ఉన్న జిల్లాల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న జిల్లాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ లేకుండా చూడాలని, సమన్వయంతో వ్యవహరించి టోకెన్ పద్ధతిలో పంపిణీకి చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. అవసరమైతే పాస్‌బుక్‌లను ఆధార్ కార్డుతో అనుసంధానించి.. యూరియా అందించే విధానాన్ని పరిశీలించాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి, కోఆపరేటివ్ కమిషనర్ సురేంద్రమోహన్, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.
యూరియా కోసం రైతులు అల్లాడుతుంటే మంత్రులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. శుక్రవారం మంత్రి తుమ్మల చేసిన వ్యాఖ్యలపైనా రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోషల్‌మీడియాలో నెటిజన్లు మండిపడ్డారు. చెప్పులను క్యూలో పెట్టి యూరియా కొరత ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు. అదే మంత్రి మళ్లీ నౌకాయానానికి ఆటంకాలు ఏర్పడ్డాయని, అందుకే కొరత ఏర్పడ్డదని సాకులు వెతుక్కోవడం విచిత్రంగా ఉందని విమర్శలు గుప్పించారు. అసలు యూరియా కొరత ఉందో లేదో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర రైతులకు ఎంత యూరియా అవసరముందో అవగాహన లేని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, సరిపడా సరఫరా చేయని కేంద్రం నిరాదరణ వెరసి.. తెలంగాణ అన్నదాతలు కష్టాలు ఎదుర్కొంటున్నారని రైతు సంఘాల నేతలు తెలిపారు. సరైన సమయంలో యూరియా తీసుకురావాలన్న ధ్యాసలేని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు… ఇప్పుడు కవరింగ్ పాలిటిక్స్ చేయడమేంటని నిలదీస్తున్నారు. ఓ వైపు రైతులు పొలాల్లో వరి నాట్లు వేసుకుని సొసైటీల చుట్టూ తిరుగుతుంటే… ఇప్పుడు పాస్‌బుక్‌లు, ఆధార్ కార్డుల అనుసంధానం అంటూ మంత్రి ఏదో వినూత్నమైన పరిష్కార విధానం కనుగొన్నట్టు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కాంగ్రెస్ పాలకుల తెలివితేటలకు, పాలన తీరుకు నిదర్శనమని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.