Runa Mafi | రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ధోకా ఇచ్చిన కాంగ్రెస్ సర్కారుపై రైతులు తమ నిరసనను మరింత తీవ్రతరం చేశారు. ఇప్పటికే వైవిధ్యంగా ఆందోళన చేపట్టిన రైతులు.. తాజాగా ‘సెల్ఫీ ఫర్ రుణమాఫీ’ పేరుతో వినూత్న ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపేందుకు వీలుగా సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్న సిద్దిపేట జిల్లా ధర్మారం రైతులు.
మిరుదొడ్డి, సెప్టెంబర్ 22 : రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత సగం మంది రైతులకు కూడా కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కారుకు బుద్ధిరావాలని సిద్దిపేట జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన రైతులు ‘సెల్ఫీ ఫర్ రుణమాఫీ’ వీడియో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం గ్రామంలో రైతులు ఒక్కచోట చేరి ‘సెల్ఫీ ఫర్ రుణమాఫీ’ వీడియోలు తీసి ట్విట్టర్, ఫేస్బుక్ తదితర మాధ్యమాల ద్వారా సీఎంవోకు పంపే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘రుణమాఫీ చేశామని జబ్బలు చరుచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, నీకు రైతులు గట్టి జవాబు చెబుతూ సెల్ఫీ వీడియోలు తీసి పంపారని’ అన్నారు. ఒక్క ధర్మారంలోనే రుణమాఫీ కాని 400 మంది రైతులు మానసికంగా ఇబ్బందులు పడుతూ సీఎం రేవంత్‌రెడ్డి సెల్ఫీ వీడియోలు తీసి పంపినట్టు తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ చేశామని మీడియాలో సీఎం రేవంత్‌రెడ్డి, మం త్రులు గొప్పలు చెప్పుకోవడం తప్పితే సగం మంది కూడా రైతులకు రుణమాఫీ కాలేదని అన్నారు.
ఈనెల 18న రుణమాఫీ కాని రైతులు మిరుదొడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెయ్యి మంది వరకు వచ్చి ధర్నా చేస్తే, బీఆర్ఎస్ నాయకులు వారికి డబ్బు ఇచ్చి తీసుకొచ్చి ఆందోళన చేయించారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి రైతులు వీడియోల ద్వారా డిజిటల్ ర్యాగింగ్ చేస్తారని హెచ్చరించారు. మిరుదొడ్డి మండల వ్యాప్తంగా 1500 మంది రైతుల నుంచి డిజిటల్ వీడియోలు సీఎంవోకు వెళ్లడం ఖాయమని అన్నారు. నిరసనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట అంజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజు లు, మాజీ సర్పంచ్‌లు తుమ్మల బాల్‌రాజు, జోగ్గారి బాల్‌నర్సయ్య, నాయకులు సూకురి లింగం, తీపిరెడ్డి దుర్గారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మైసయ్య, పర్శరాములు, నారాయణ, మల్లేశం గౌడ్, భిక్షపతి, బాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు.