వేంసూరు, ఫిబ్రవరి 21 : పంట పొలాల్లోకి వెళ్లేందుకు గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల ఇబ్బంది పడుతున్నామని, తమకు దారి చూపాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వేంసూరు మండలం ఎర్రగుంటపాడు, వేంసూరు గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం వేంసూరులో గ్రీన్ఫీల్డ్ హైవేపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే పక్కన ఉన్న తమ పంట పొలాల్లోకి వెళ్లేందుకు దారి ఇవ్వకుండా కంచె వేయడంతో కిలోమీటర్లకొద్దీ తిరిగి తమ పొలాలకు రావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. మామిడి తోటల్లోకి కూడా కనీసం వాహనాలు వెళ్లడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనున్న పొలాల్లోకి వెళ్లేందుకు దారి చూపాలని వారు కోరారు.