వీణవంక, నవంబర్ 8: ధాన్యం తూకం వేస్తుండగా పోలీసులు వచ్చి ఆపారంటూ శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లో రైతులు ఆందోళనకు దిగా రు. నర్సింగాపూర్ రైతులు పది రోజులుగా ధా న్యం ఆరబోస్తున్నారు. ఈ క్రమంలో ఎండిన ధాన్యాన్ని తూకం వేయాలని స్థానిక హమాలీలకు తెలుపగా గతం కంటే ఎక్కువ డబ్బు లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా కాలయాపన చేశారు. దీంతో రైతులు చేసేదేమీ లేక బిహార్‌కు చెందిన కూలీలతో శుక్రవారం తూకం ప్రారంభించడంతో స్థానిక హమాలీలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తూకం ఆపాలని ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు శనివారం వచ్చి ధాన్యం తూకం ఆపడంతో ఆగ్రహించిన రైతులు జమ్మికుంట-కరీంనగర్ ప్రధాన రహదారిపై ధాన్యం బస్తాలు పెట్టి సుమారు గంటపాటు రాస్తారోకో చేశా రు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ క్రమంలో కొద్దిసేపు పోలీసులు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎస్సై ఆవుల తిరుపతి రైతులతో మాట్లాడి ‘మీకు నచ్చిన వారితో తూకం వేసుకోవచ్చు’ అని తెలుపగా రైతులు ధర్నా విరమించారు.