భూపాలపల్లి రూరల్/రఘునాథపాలెం, జూన్ 15: భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్ట పరిహారం అందజేస్తామని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ సేకరణపై టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన రైతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభివృద్ధికి రహదారుల ఏర్పాటు అత్యంత అవసరమని, భూ సేకరణ విషయంలో రైతుల సూచనలు, సలహాలు తీసుకొని నివేదికలు పంపామని తెలిపారు. 350 ఎకరాల్లో 35 కిలోమీటర్ల దూరం వరకు గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే వస్తుందని, రోడ్డు నిర్మాణం కోసం 45 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు.
ఈ సందర్భంగా రైతులు స్పందిస్తూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు తమ భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. తమకు భూములే జీవనాధారమని, తమను ఇబ్బంది పెట్టొద్దని కలెక్టర్ ముందు బ్యానర్లు పట్టుకొని నిరసన తెలిపారు. రైతుల నిరసనతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం భూపాలపల్లి-పరకాల రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రధాని మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేకు భూములిచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మంగీలాల్, నేషనల్ హైవే అథారిటీ అధికారులు, మూడు మండలాల రైతులు పాల్గొన్నారు. కాగా.. ఖమ్మం జిల్లా వీ వెంకటాయపాలెం రెవెన్యూ పరిధిలో నాగ్‌పూర్ టు అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రెవెన్యూ అధికారులు పోలీసు పహారా నడుమ శనివారం తెల్లవారుజామున 5 గంటలకు భూ సర్వే చేపట్టారు. భూములు కోల్పోతున్న రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు మూడు బృందాలుగా పోలీసులతో ప్రత్యక్షమయ్యారు.
విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రైతులు వైరా రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురు రైతులను అరెస్ట్ చేసి రఘునాథపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైతులతో సంబంధం లేకుండా సర్వే చేస్తున్న నేషనల్ హైవే అథారిటీ అధికారుల తీరును సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నవీన్‌రెడ్డి తప్పుపట్టారు.