రైతు డిక్లరేషన్ పేరిట నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టేందుకు కర్షకలోకం సిద్ధమైంది. కేసీఆర్ పదేండ్ల పాలనలో దర్జాగా బతికి.. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఎవుసం ఆగమై కన్నీళ్లు పెడుతున్న రైతులకు అండగా ఓరుగల్లులో బుధవారం బీఆర్ఎస్ ‘రైతు సంగ్రామ సదస్సు’ నిర్వహించనున్నది. 2022, మే 6న వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతు డిక్లరేషన్‌ను ప్రకటించి నేటికి నాలుగేండ్లు పూర్తయినా.. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా.. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంపై రాష్ట్ర రైతాంగం రగిలిపోతున్నది. అదునుకు యూరియా అందించకపోవడం, రైతు భరోసా వేయకపోవడమే కాకుండా పండించిన పంటను కూడా కొనకుండా మొండికేస్తున్న రేవంత్ సర్కార్‌పై అన్నదాతల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు సంగ్రామ సదస్సుతో బీఆర్ఎస్ భరోసా కల్పించనున్నది. ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరిత హామీలతో దగాపడ్డ రైతుల తరఫున ‘ఏదీ నీ రైతు డిక్లరేషన్?’ అని సర్కార్‌ను నిగ్గదీసి అడుగనున్నది.
హనుమకొండ, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మోసపూరిత హామీలతో దగా చేసిన కాంగ్రెస్‌ను కడిగిపారేసేందుకు రైతులు కదం తొక్కుతున్నారు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు ఓరుగల్లు వేదికగా నిర్వహిస్తున్న ‘రైతు సంగ్రామ సదస్సు’కు వేలాది దండుకట్టి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలన్న తలంపుతో నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి 2022, మే 6న వరంగల్‌లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ‘రైతు డిక్లరేషన్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. హామీ ఇచ్చి నాలుగేండ్లు, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా రైతు డిక్లరేషన్‌ను కాంగ్రెస్ అమలు చేయకపోవడంపై రాష్ట్ర రైతాంగం ఆగ్రహంతో ఉన్నది.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం కుదేలైంది. సాగునీరు, కరెంట్, యూరియా సరఫరా, వడ్లు, మక్కలు, జొన్నలు, శనగల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పండించిన ఏ పంటకూ కనీస మద్దతు ధర దక్కని దుస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ సగానికి సగం కోతలు పెట్టింది. తాజాగా వాయిదా పద్ధతిలో ఎగవేస్తున్నది. రైతు బీమా పథకం అమలుపై అస్పష్టత నెలకొన్నది. రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మోసానికి నిరసనగా బీఆర్ఎస్ బుధవారం వరంగల్‌లో సీఎస్ఆర్ గార్డెన్స్ సర్కిల్లో రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తున్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పది వేల మంది రైతులు పాల్గొనే ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా రైతులు పెద్ద సంఖ్యలో సదస్సుకు వచ్చేందుకు కదం తొక్కుతున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో సదస్సుకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలుగకుండా అధునాతన టెంట్లలో ప్రాంగణం సిద్ధం చేశారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లుగా రైతులను అన్ని రకాలుగా మోసం చేసింది. వరంగల్ డిక్లరేషన్‌లోని ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కూడా సర్కార్ కొనుగోలు చేయకుండా మొండికేయడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసి రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. వెంటవెంటనే రైతుల బ్యాంకు అకౌంట్లలో ధాన్యం డబ్బులను కూడా జమ చేసింది. బీఆర్ఎస్ హయాంలో మక్కజొన్నకు కనీస మద్దతు ధర తగ్గకుండా ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాంగ్రెస్ సర్కార్ మక్కజొన్న రైతులను పూర్తిగా వ్యాపారుల దయకు వదిలేసింది.
ఈ క్రమంలో అన్నదాతలకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు క్షేత్ర స్థాయిలోనే ఉంటూ వారి స మస్యలపై సర్కార్‌ను నిలదీస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను ప్రభుత్వానికి ఎత్తి చూపుతున్నారు. అన్నదాతలకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు అధికారులకు సమస్యలను వివరిస్తూ పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు.
రైతులకు అండగా నిలబడి నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ఏవిధంగా రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టిందో అలానే కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రైతు డిక్లరేషన్‌ను ప్రకటించి నాలుగేండ్లు పూర్తయినా కాంగ్రెస్ ఇప్పటి వరకు హామీలు నెరవేర్చకపోవడంపై నిగ్గదీసి అడిగేందుకు ఓరుగల్లు వేదికగా బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేసింది.
కాంగ్రె స్ సర్కార్ తీరుతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న రైతులకు సంగ్రామ సదస్సుతో బీఆర్ఎస్ భరోసా కల్పించనున్నది. డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తూర్పారబట్టనున్నారు. వ్యవసాయ రంగానికి కేసీఆర్ సర్కార్ ఇచ్చిన ప్రాధాన్యతను వివరిస్తూనే కాంగ్రెస్ మోసపు వైఖరిని ఎండగట్టనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ నుంచే ‘ఏదీ నీ రైతు డిక్లరేషన్ ?’ అని కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీయనున్నారు.

వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో రైతులతో మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు సత్యవతి, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో సర్కార్ నిర్వహిస్తున్న రైతు మేళాలో మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా సగానికి పైగా ఖాళీగా ఉన్న కుర్చీలు