దుమ్ముగూడెం, జూలై 23 : భద్రాచలం నుండి దుమ్ముగూడెం ప్రధాన రహదారి మార్గం దయనీయంగా మారింది. ప్రతి రోజు ఓవర్ లోడుతో ఇసుక లారీల రాకపోకల కారణంగా దుమ్ముగూడెం భద్రాచలం ప్రధాన రహదారికి పలుచోట్ల గుంతలు పడ్డాయి. అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రజలు చేసిన ఆందోళన కారణంగా ప్రజాప్రతినిధులు అధికారులు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. కాని టెండరు జరగకుండానే గుత్తేదారులు పనులు చేపట్టడంతో కొంత మేరకే ఈ పనులు చేపట్టారు. పర్ణశాల నుంచి లక్ష్మీనగరం వరకు పనులు చేపట్టకపోవడంతో చిన్ననల్లబెల్లి గ్రామం వద్ద భారీగా గుంత ఏర్పడింది. చిన్ననల్లబెల్లి ప్రధాన రహదారి వద్ద భారీ గుంత ఏర్పడింది. ఆ గుంతకు ఎడమ వైపు చత్తీస్గఢ్, పైడాకుల మడుగు, జిన్నెలగూడెం తదితర గ్రామాలు ఈ ప్రధాన రహదారికే చేరుకుంటాయి.
అదేవిధంగా ఎడమ వైపు ఎం.కాశీనగరం, కె.కాశీనగరం తదితర గ్రామాల ప్రజలు ఈ ప్రధాన రహదారికి చేరుకుంటారు. ఈ గుంతలమయంతో పలుమార్లు యాక్సిడెంట్లు సైతం జరిగాయి. కాగా నిత్యం భద్రాచలం నుంచి పర్ణశాల వరకు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి భక్తులు వస్తుంటారు. మరోవైపు రాత్రి పగలు అనకుండా భారీగా లారీలు దుమ్ముగూడెం మండలం నుండి వెళ్లడంతో ఈ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. ఎదురుగా వస్తున్న వాహనాలు తప్పించబోయి ప్రమాదాలు చోటుచేసుకున్న సంఘటనలు అనేకం. దీనిపై గతంలో ములకపాడు వద్ద భారీగా ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. అయినప్పటికీ కొంత మేరకు పనులు చేసినప్పటికీ భారీ ఇసుక లారీలు రవాణ జరగడంతో మళ్లీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించి మరమ్మతు పనులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

గుంతలమయంగా భద్రాచలం -పర్ణశాల ప్రధాన రహదారి