– మంత్రి ఎమ్మెల్యే తమ ఘనతని చెప్పుకోవడం సిగ్గుచేటు
– నిర్మాణం పూర్తయ్యేదాకా విశ్రమించేది లేదు
– మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ, సెప్టెంబర్ 30 : కోదాడ పట్టణంలో వంద పడకల దవాఖానను తామే మంజూరు చేయించినట్టు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని.. ఆ ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని, ప్రభుత్వ రికార్డుల సాక్షిగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. బుధవారం నత్త నడకన కొనసాగుతున్న ప్రభుత్వ దావఖాన పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెరుగుతున్న జనాభాకు, కోదాడ ప్రజల అత్యవసర వైద్య అవసరాలకు అనుగుణంగా, మాతా–శిశు ఆరోగ్యాన్ని లక్ష్యంగా చేసుకుని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయించినట్లు తెలిపారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో, 442 జీవో ద్వారా ఆగస్టు 2023 తన పట్టుదలతో రూ.26 కోట్ల నిధులు మంజూరు చేయించిన జీవోను ఈ సందర్భంగా చూయించారు.
ప్రభుత్వం మారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నెల తిరక్కుండానే ముగ్గురు మంత్రులు కోదాడకు వచ్చి హడావుడిగా కొబ్బరికాయలు కొట్టి, శిలాఫలకాలు వేశారని ఆయన విమర్శించారు. అయితే కొబ్బరికాయ కొట్టిన రోజే నిధులు ఉన్నప్పుడు, దాదాపు ఒక సంవత్సరం పాటు అక్కడ తట్టెడు మట్టి ఎందుకు పోయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ చేతగాని తనంపై కోదాడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాతే పనులు ప్రారంభించారన్నారు. ఇప్పటికీ సదరు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. పనుల్లో సొంత పెత్తనంతో పాటు కాంట్రాక్టుల కమీషన్ల దందా ఎక్కువైందని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే తన తెలివితేటలన్నీ ఆస్పత్రి భవనం పైనే చూపిస్తున్నట్లు తెలిపారు. వేసిన బండలు తీయించి మళ్లీ కొత్త బండలు వేయించడం తప్ప అభివృద్ధి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. కమీషన్ల కోసం కోసం పనులు ముందుకు సాగకుండా అడ్డుకోవడంలోనే ఎమ్మెల్యే సమయం అంతా సరిపోతోందని ఎద్దేవా చేశారు.

‘కోదాడలో వంద పడకల దవాఖాన ఘనత బీఆర్ఎస్దే’
అంతా తమ గొప్పతనమే అని పత్రికల్లో కలర్‌ఫుల్ ప్రకటనలు ఇచ్చుకోవడం ఉత్తమ్ కు ఫ్యాషన్ అయిపోయిందని దుయ్యబట్టారు. 100 పడకల దవాఖానతో పాటు కిడ్నీ రోగుల కోసం ఐదు పడకల డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేయించి, వందలాది మందికి ఉచిత వైద్యం అందించామని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పాలనలో ఆ డయాలసిస్ సెంటర్ ఎందుకు పని చేయడం లేదో సమాధానం చెప్పాలన్నారు. తన హయాంలో ప్రజల కోసం తెచ్చిన ప్రతి రూపాయి కోదాడ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టానని, ప్రజల కోసం తాను ప్రారంభించిన ప్రతి పని పూర్తయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటానన్నారు. “ఈ 100 పడకల ఆస్పత్రి జీవో, రూ.29 కోట్ల నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని వారు నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమన్నారు. కోదాడ ప్రజలకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించినందుకు మంత్రి, ఎమ్మెల్యే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు నయీమ్, పైడిమరి సత్యబాబు, చీమ నరేష్, భాగ్యమ్మ, గట్ల కోటేశ్వరరావు, కరిముల్లా, బాబా, ఉపేందర్ గౌడ్, శ్రీనివాస్, అలవాల వెంకట్, ఇతర నాయకులు పాల్గొన్నారు.