రామగిరి, మార్చి 18: ‘వ్యవసాయం చేసుకొని బతికే తమ పొట్టకొట్టవద్దని, ఇండస్ట్రియల్ పార్కు ఇక్కడ వద్దే వద్దని, మమ్ముల చంపినా భూములు ఇచ్చేదిలేదని’ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ రైతులు తేల్చిచెప్పారు. మంగళవారం రత్నాపూర్ శివారు మేడిపల్లిలో స్థల పరిశీలన కోసం అధికారులు వస్తున్నట్టు సమాచారం మేరకు రైతులందరూ గ్రామ ప్రధాన కూడలికి వెళ్లి బైఠాయించారు.
మంథని ఆర్డీవో సురేష్, ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ మహేశ్వర్రావు, తహసీల్దార్ సుమన్, పోలీసులను అడ్డుకున్నారు. మంథని సీఐ రాజు, ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వారించినా, రైతులు ససేమిరా అన్నారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ రైతులను చెదరగొట్టేందుకు యత్నించగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. నాలుగు గంటల పాటు బైఠాయించి, అధికారులను అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకున్నారు. దీంతో చేసేదేమిలేక వారు వెనుదిరిగారు.