ఆదిలాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. జొన్న పంట చేతికొచ్చి 15 రోజులు దాటినా కొనుగోళ్లు జరగడం లేదు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాన్ని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క శనివారం ప్రారంభించారు. తలమడుగు మండలం కజ్జర్ల రైతులు సోమవారం ఉదయం వాహనాల్లో భారీగా పంట విక్రయానికి ఆదిలాబాద్ మార్కెట్కు తీసుకొచ్చారు. మార్కెట్ గేటుకు తాళం వేసి ఉండటంతో 43 డిగ్రీల ఎండలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. పంటను కొనుగోలు చేయాలని మార్కెటింగ్ అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. ఎకరాకు 14 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తున్నందున.. ఆ వివరాలు ఆన్లైన్లో అప్డేట్ కాకపోవడంతో కొనుగోళ్లు జరపడం లేదని అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి జొన్న పంట కొనుగోళ్లు చేపడతామని వారు పేర్కొన్నారు.
ఎకరాకు 20 క్వింటాళ్లు కొనాలని నిరసన ; పెంచికల్పాడ్ కేంద్రం వద్ద రైతుల ఆందోళన
కుంటాల, ఏప్రిల్ 21 : నిర్మల్ జిల్లా కుంటాల మండలం పెంచికల్పాడ్ కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. జొన్న పంటను ఎకరాకు 20 క్వింటాళ్లు కొనాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కల్లూరు, పెంచికల్పాడ్, ఓలా, కుంటాల, లింబా (కే) గ్రామాల్లోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి 8.65 క్వింటాళ్లు మాత్రమే తూకం వేస్తున్నారని వారు వాపోయారు. ఎకరాకు జొన్న దిగుబడి 25 నుంచి 30 క్వింటాళ్లు వచ్చిందని, ఆ మేరకు కొనుగోళ్ల పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు.